ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి రూటే సపరేటు. ఆయనకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా ఏ విషయాన్ని అయినా గుట్టుగా దాచుకోవడం అస్సలు తెలియదు. వెంటనే ఎక్కడైనా సరే, కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటాడు. తనకు కాస్త ఇబ్బంది కలిగితే అది ఎంతటి వారిపైనైనా తన కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు గతంలో చాలా చూశాం. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకు పడ్డాడు. తెదేపాలో తనకు ఇస్తున్న ప్రాధాన్యతపై కాస్త కటువుగానే అరిచాడు. తాజాగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోలేదని వ్యాఖ్యానించాడు. దాంతో ఆ మాటలు ఇప్పుడు అంతా కలకలం రేపుతున్నాయి. ఇంకా తాను మాట్లాడుతూ.. బాబు ఇంకా ఉద్యోగులనే ఎక్కువగా నమ్ముకుంటున్నాడని, అలా పాలించడం సరికాదని తాను ఎన్నిసార్లు చెప్పినా తనమాట లెక్కచేయడం లేదని వివరించాడు.
అయితే నిజంగా తెలుగుదేశం పార్టీలో తనలాంటి సీనియర్ నాయకులకు అస్సలు ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన తెలిపాడు. పయ్యావుల కేశవ్ లాంటి వ్యక్తులు ఎప్పటినుంచో పార్టీనే నమ్మకొని ఉన్నారని వారికి కూడా పార్టీలో తగిన ప్రాధాన్యత దొరకక పోవడంపై ఆయన విరుచుకు పడ్డాడు. తాను కేవలం జగన్ పై వ్యతిరేకతతోనే తెదేపాలోకి వచ్చానని, అంతేగాని... బాబును చూసో, మరెవరిని చూసో రాలేదని ఆయన తెలిపాడు. కాగా తాజాగా జేసీ దివాకర్ రెడ్డి పార్టీలోని వ్యక్తులకు తగిన ప్రాధాన్యత రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చూద్దాం దీనిపట్ల చంద్రబాబు ఎలా స్పందిస్తాడో..!