అక్కినేని కుటుంబంలో మూడవ తరం నట వారసులలో ఒకడైన అఖిల్ అక్కినేనికి ఇతర అక్కినేని కథానాయకుల కంటే కూడా అభిమాన బలం అధికంగానే వుంది. అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్ ఘోర పరాజయం చెందినప్పటికీ 19 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టగలిగింది అంటే సామాన్యమైన విషయం కాదు. సుప్రీమ్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి ధరమ్ తేజ్ నటించిన విజయవంతమైన చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కలెక్షన్స్ కి అఖిల్ కలెక్షన్స్ సమానంగా నిలిచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచాయి. అఖిల్ డిజాస్టర్ తో తదుపరి చిత్రం పై అంచనాలు వుండవు అని అందరూ ఊహించగా, నాగ్ మాత్రం అఖిల్ కి వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అనేక కథలు విని వాటిల్లో కొన్ని ముహూర్తం దశ వరకు తీసుకువెళ్లి కూడా వెనక్కి తగ్గారు. చివరకు అఖిల్ రెండవ చిత్రాన్ని అక్కినేని కుటుంబానికి మనం వంటి గుర్తుండిపోయే సక్సెస్ ఇచ్చిన విక్రమ్.కె.కుమార్ కు అప్పగించాడు నాగార్జున.
నాగార్జున అంగీకారం తెలిపిన వెంటనే చిత్రీకరణ మొదలై ఉంటే నేటికీ దాదాపు సగం సినిమా చిత్రీకరణ పూర్తి అయిపోయి ఉండాలి. కానీ మధ్యలో దర్శకుడు విక్రమ్.కె.కుమార్ వివాహం ఉండటం, అఖిల్ నిశ్చితార్ధం ఉండటంతో చిత్రీకరణ మధ్యలో షెడ్యూల్ బ్రేక్స్ ను ఇష్టపడని నాగార్జున స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంత కాలం ఆపారు. జనవరి 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ రెండవ చిత్రం ముహూర్తానికి రంగం సిద్దమైయింది. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
యాదృచ్చికంగా అక్కినేని నాగ చైతన్య రెండవ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎ.ఆర్.రహమాన్ అఖిల్ రెండవ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తుండటం విశేషం. రీసెంట్ గా నిశ్చితార్థం..ఇప్పుడు మూవీ న్యూస్..చూస్తుంటే అఖిల్ టైం స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది..కదా!