బన్నీ నటించిన 'సరైనోడు' ఆడియోకు నిర్మాత అల్లు అరవింద్ ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశాడు. ఈ చిత్రం ప్రమోషన్లను మాత్రం భారీఎత్తున చేసి, ఆ తర్వాత ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను వేడుకగా చేశాడు. ఈ చిత్రం డివైడ్‌టాక్‌ను ఎదుర్కొని మరీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా అదే రూట్‌ను రామచరణ్ నటించిన 'ధృవ'కు కూడా ఫాలోయిన అల్లు ఈ చిత్రం కూడా మంచి విజయం దిశగా పయనిస్తుండటంతో చిరుకు సలహా ఇచ్చి, ఆయన నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150'కి కూడా ఆడియో వేడుకను నిర్వహించకుండా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా పాటలను డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసేలా ప్లాన్ చేశాడు. ఈ చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్ 25న మొదట విజయవాడలో భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి, అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా జరపాలని మొదట చిరు, నిర్మాత చరణ్‌లు ప్లాన్ చేశారు.
అందునా దాదాపు దశాబ్దం తర్వాత చిరు నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం కావడంతో ఈ భారీ వేడుక కోసం మెగాభిమానులు కొంతకాలంగా కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలా ఆడియోను గ్రాండ్‌గా చేయడం ద్వారా చిత్రానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కల్పించాలని భావించినప్పటికీ, అల్లు ప్లాన్ ప్రకారం చిరు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను మాత్రం జనవరి మొదటి వారంలో వేడుకగా జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలా మెగాహీరోలు తమకు అచ్చివచ్చిన సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు.
కాగా ఈ చిత్రం ఆడియో వేడుక క్యాన్సిల్ అయినప్పటికీ ఈ రోజు ఉదయం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాభిమానులు విజయవాడలో సమావేశమయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఈ ముఖ్య అభిమానుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ చిత్రంపై ప్రజల్లో క్యూరియాసిటీ ఎలా కలిగించాలి? మహానగరాలు, నగరాలు, పట్టణాలతో పాటు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఈ చిత్రంపై ఆసక్తి పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించారని సమాచారం. మొత్తానికి బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని దీటుగా ఎదుర్కోవడం కోసం అభిమానులు తీవ్రంగా శ్రమించాలని నిర్ణయించుకున్నారట.