ప్రముఖ తెలుగు నిర్మాత అనిల్ సుంకర 'డ్రీమ్స్ మర్చంట్స్' పతాకంపై శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్‌కలాం నిజజీవితం ఆధారంగా ఓ బయోపిక్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ కోప్రొడ్యూస్ చేయనున్నారట. ఇంగ్లీషులో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఇందులో అబ్దుల్‌కలాంగా ఎవరు నటిస్తారు? అనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రానికి ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తుంటే, మరికొందరు మాత్రం ఈ చిత్రాన్ని ఇంగ్లీషు భాషల్లో రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నందున ఈ చిత్రానికి ఓ బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. కాగా గతంలోనే బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ప్రమోద్ అనే మరాఠి దర్శకునితో 'ఏపిజె' పేరుతో కలాం జీవితచరిత్రను తీయాలని భావించాడు. సెట్స్ దాకా వచ్చిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని సమాచారం. మరోపక్క 'ఐయామ్ కలాం' పేరుతో నిలా మధాబ్ వాడీ అనే దర్శకుడు ఆయన జీవిత చరిత్రను హిందీలో తెరకెక్కించాలని భావించి, అందుకు తగ్గ రీసెర్చి కూడా చేసి, స్క్రిప్ట్‌ను తయారుచేస్తున్నాడు. ఆయన మాత్రం కలాం పాత్రకు బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ తప్ప వేరెవ్వరూ న్యాయం చేయలేరని అభిప్రాయపడుతున్నాడు. మరి బిగ్‌బి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకుంటే అనిల్‌సుంకర తీస్తున్న ఈ బయోపిక్ ముందుగా రిలీజ్ అవుతుందా? లేక బాలీవుడ్ చిత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనే అంశాలు గందరగోళం సృష్టిస్తున్నాయి.