నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు చాలా కాలం నుండి ఎడమొహం పెడమొహంగానే ఉంటారన్న విషయం ప్రేక్షకుల్లో ఉంది. ఈ విషయం వీరి అభిమానుల్లో మరింత నాటుకుపోయింది. అయితే ఆ ఆలోచనను పటాపంచలు చేసేలా ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను మెచ్చుకొనేలా వ్యవహరిస్తున్నాడు.
బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నందమూరి అభిమాన సందోహం అంతా అమిత ఉత్సాహంలో మునిగి తేలారు. వీరి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు అయ్యేలా జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తించాడు. శుక్రవారం సాయంత్రం విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ ను చూసిన ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.
గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ను చూసిన ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ ‘ఎన్ బి కే నెవెర్ బిఫోర్’ అంటూ ట్వీట్ చేశాడు. అలా ఎన్టీఆర్ చేయడం ద్వారా వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించినట్లుగా అయింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... ట్రైలర్ అద్భుతంగా ఉందని గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు క్రిష్ బాలకృష్ణని సరికొత్తగా చూపించాడని ప్రశంసించాడు. బాలకృష్ణ ది బెస్ట్ అనిపించేలా ఈ చిత్రంలో ఉన్నాడని ఎన్టీఆర్ తెల్పడం విశేషం. మొత్తానికి బాబాయ్ ని అబ్బాయ్ బాగానే ప్రసన్నం చేసుకొనేలా వ్యవహరిస్తున్నాడు.