తెలంగాణ తెలుగదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో పూర్తి తేడాగా మాట్లాడాడు. నిజంగా శాసన సభ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఓ సారి గమనిస్తే అనుమానం కలుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత డైరెక్షన్ లో నడుస్తున్నాడా? లేకా తెలంగాణలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా తిరుగులేదన్న ధోరణిలో ఉన్నాడా? అనే అనుమానం కలగక మానదు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా విచిత్రంగా ప్రసంగించాడు. ఆయన ప్రసంగం ఆద్యంతం విన్నవారెవరికైనా రేవంత్ రెడ్డి పార్టీ నియమాలు నిబంధనలు పక్కనబెట్టి, చాలా విరుద్ధంగా మాట్లాడినట్లు తెలుస్తుంది.
విషయం ఏంటంటే.. పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్, ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలందరినీ తిప్పే దిశగా తెదేపా అధినాయకుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా క్యాష్ లెస్ సేవలందించే దిశగా ఆంధ్రప్రదేశ్ లో చాలా త్వరితగతిన మేలుకొని పర్స్ మొబైల్ యాప్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేందుకు సూచనలిచ్చే ముఖ్యమంత్రుల కమిటీకి కూడా చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీ అధినాయకుడికి విరుద్ధంగా డిజిటల్, నగదు రహిత లావాదేవీలు అసాధ్యం అంటూ ప్రసంగాలతో అదరగొడుతున్నాడు. కనీసం కరెంటు కూడా లేని కొన్ని కుగ్రామాలలో స్వైపింగ్ మిషన్లతో లావాదేవీలు ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించాడు. ఏమీ తెలియని మారు మూల గ్రామాల ప్రజలకు స్వైపింగ్ చెల్లింపులు ఎలా సాద్యమంటూ రేవంత్ ప్రసంగించాడు. డబ్బులు ఇవ్వాల్సిన చోట తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సిందే. అంతేగానీ... అన్నిచోట్ల స్వైపింగ్ చెల్లింపులు సాధ్యంకాదని రేవంత్ తెలిపాడు. అయితే నిజంగా తెలంగాణలో డిజిటల్ చెల్లింపులేగానీ చేయాలంటే సుమారు 10 లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరమని రేవంత్ వెల్లడించాడు. కానీ.. వాటిన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని కూడా రేవంత్ తన ప్రసంగంలో తెలిపాడు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ పార్టీ అధినేత అభిప్రాయాలతోనూ, పార్టీ నిర్ణయాలతోనూ ఏమాత్రం సంబంధం లేకుండా రేవంత్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఎందుకు దారితీస్తుందో, దేనికి సంకేతమో అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా రేవంత్ అసెంబ్లీ ప్రసంగం మాత్రం తమపార్టీ నిర్ణయాలకు పూర్తి విరుద్ధంగా ఉందంటున్నారు నేతలు.