'నకిలి, డాక్టర్ సలీం' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని, ఆయన నటించిన తెలుగు డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' తెలుగునాట సంచలన విజయం నమోదు చేసింది. పెద్ద పెద్ద స్ట్రెయిట్ చిత్రాలకు కూడా ఎదురొడ్డి నిలిచి, పెట్టుబడికి ఐదారు రెట్లు లాభాలు గడించింది. దీంతో ఆయన తమిళంలో చేసిన 'సైతాన్' చిత్రంపై కూడా తెలుగు నాట మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక ఈ చిత్రంలోని మొదటి పది నిమిషాల వీడియోను రిలీజ్‌కు ముందే విడుదల చేయడం, అది సంచలనం సృష్టించడంతో తెలుగు నిర్మాతలు, బయ్యర్లలో ఈ చిత్రానికి విడుదలకు ముందు భారీ క్రేజ్ వచ్చింది. కథ ఏమిటో తెలియకపోయినా, విజయ్ ఆంటోని వైవిద్యభరిత కథలను చేస్తాడనే నమ్మకంతో ఈ చిత్రాన్ని ఏడుకోట్ల భారీ ఫ్యాన్సీ రేటుకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'బేతాళుడు'ను కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులో అత్యధికంగా 500థియేటర్లలో విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రం కనీసం మూడుకోట్ల షేర్‌ను కూడా వసూలు చేయకపోవడంతో దాదాపు 4కోట్లకు పైగా నష్టం వచ్చింది. అయినా ఓ తమిళ డబ్బింగ్ ఫ్లాప్ చిత్రం మూడు కోట్ల షేర్ వసూలు చేయడం గొప్పేనని, కానీ ఈ చిత్రానికి ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయంటే అది సినిమాలో ఉన్న దమ్మును చూసి కాదని, కేవలం విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' క్రేజే దీనికి ప్లస్ అయిందని అంటున్నారు. కాగా మోదీ కరెన్సీ ఎఫెక్ట్ ఈ చిత్ర పరాజయానికి మరో కారణంగా చెబుతున్నారు. మొత్తానికి 'బిచ్చగాడు' క్రేజ్‌ను నమ్ముకున్న తెలుగు వెర్షన్ నిర్మాత, బయ్యర్లను నాలుగుకోట్ల నష్టాలతో ఈ చిత్రం నిలువునా ముంచిందనేది వాస్తవం.