వాస్తవిక గాథలు, వివాదాస్పద వ్యక్తుల జీవితాలు, సంఘటనలకు తనదైన అభూతకల్పనలను, సినిమా ట్రిక్ గా ఉపయోగిస్తూ చిత్రాలు తీయడం, వివాదాల తేనెతుట్టెలను కదపడంలో వర్మను మించిన దర్శకుడు లేడనే చెప్పాలి. దీనికి ఆయన తీసిన, తీస్తున్న 'సర్కార్, డిపార్ట్‌మెంట్, కంపెనీ, రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్, 27/11 ఎటాక్స్, గవర్నమెంట్, వంగవీటి, నయీమ్' వంటివే ఉదాహరణ.
కాగా ప్రస్తుతం వర్మ మరో వివాదాస్పద స్టోరీని తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హఠాత్తుగా మరణించిన స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఆమె ప్రియసఖి శశిరేఖ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశం మొత్తం ఆమె ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. ఆమె చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. జయ ఆస్థుల కోసం, ఆమె పీఠం కోసం శశికళ ఎన్నో కుట్రలకు పాల్పడిందని, జయ హఠాన్మరణం వెనుక శశికళ పాత్ర ఎంతో ఉందని, ఆమె జయకు స్లోపాయిజన్ ఇప్పించిందనే వాదనలు తమిళనాడులోనే కాదు... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వర్మ శశికళ మీద ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఆల్‌రెడీ దీనికి 'శశికళ' అనే టైటిల్‌ను సైతం రిజిష్టర్ చేయించే ప్రయత్నాల్లో ఉన్నాడట. అదే నిజమైతే వర్మ మరో సంచలనానికి కేంద్రబిందువు కావడం ఖాయంగా కనిపిస్తోంది.