వెండితెర వెలుగు, యుగానికొక్కడు అయిన అన్న నందమూరి తారక రామారావును ఈ సందర్భంగా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసలు సీనియర్ ఎన్టీఆర్ తెరపైన చేయని పాత్రలేదు అంటే అతిశయోక్తి కాదు. అతను విచారించి, దానిపై పట్టు సాధించని సబ్జెక్టు లేదంటే అస్సలు నమ్మలేం. నిజంగా తెలుగు సినిమా చరిత్రనుగాని చూసుకుంటే.. ఎన్టీఆర్ ఒక అవతార పురుషుడుగానే ప్రేక్షకులకు దర్శనమిస్తాడు. దర్శక మహేంద్రుడు కె.వి. రెడ్డి మనసులోంచి సృజించి చేసిన ఎన్టీఆర్, అచ్చుగుద్దినట్లు సరిపోయిన కృష్ణుడి పాత్ర తాలూకూ ఫోటోను అప్పట్లో తెలుగు జనాలంతా పూజా మందిరాల్లో పెట్టుకొని పూజించారంటే అది ఎంతటి మహత్తో తెలిసిన విషయమే.
కాగా ఆ విధంగా ఎన్టీఆర్ తన మనసులో అనుకున్న ఓ పాత్రను చేద్దామనుకొని విడిచిపెట్టేశాడు. ఆ పాత్రను చేయడం ఎంతో గర్వంగా భావించాడు బాలకృష్ణ. అందుకనే తన నటజీవితంలోనే మైలురాయి అయిన 100 వ చిత్రంగా, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలోని పాత్రను చేయడం గొప్ప అద్భుతావకాశంగా భావిస్తున్నాడు. అలా గొప్ప వరంగా, అందివచ్చిన అవకాశంగా ఎన్టీఆర్ చేద్దామనుకొని విడిచిపెట్టిన పాత్రని ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ చేశాడంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి.
కాగా గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను వెండి తెరకు ఎక్కించి ఆ పాత్రలో తాను నట విశ్వరూపాన్ని ప్రదర్శించాలని ఎన్టీఆర్ అనుకున్నాడట. అందుకోసమని.. గౌతమి పుత్ర శాతకర్ణి పేరుతో స్క్రిప్టును కూడా రూపొందించి పెట్టుకొని గెటప్ ఎలా ఉండాలి. ఇంకా దానికి సంబంధించిన ఆయుధాలు, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలన్నదానిపై బీభత్సంగా పరిశోధన కూడా చేసి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. మొత్తానికి ఏమైందో ఏమోగానీ, ఆ పాత్రను వెండితెరపై ఆవిష్కరించడం జరగలేదు. అయితే ఇప్పుడు అదే అందివచ్చిన అవకాశంగా.. ఆయన నట వారసుడు నటసింహం నందమూరి బాలకృష్ణ తన 100 వ చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో చేయడం గొప్ప వరంగా భావిస్తుంది చిత్ర యూనిట్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించి చేసిన పరిశోధన ఈ చిత్రానికి ఉపయోగించినట్లు కూడా వార్తలు పొక్కుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం తాలూకూ షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో శరవేగంతో దూసుకుపోతూ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ రోజు చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. దాదాపు వంద థియేటర్లలో గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. కాగా ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియాను విడుదల చేయాలని భావించినా అనివార్య కారణాలవల్ల అది వాయిదా పడింది. మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ చేయాలనుకొని భావించిన పాత్రలో ఆయన నట వారసుడు బాలకృష్ణ మెరవనున్నాడన్నమాట.