మన తెలుగు స్టార్స్ కథలో కొత్తదనం కోసం ఎంత తపిస్తారో తెలియదు కానీ.. తమ సరసన నటించే హీరోయిన్లు, విలన్ల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మన స్టార్స్ తమ చిత్రాలలో పరభాషా విలన్ల కోసం పరితపిస్తుంటారు. కాగా ఈ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకొని, నిర్మాతల ద్వారా భారీ రెమ్యూనరేషన్ వస్తుండటంతో పరభాషా హీరోలు, మరీ ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు మన తెలుగు స్టార్స్ చిత్రాలలో విలన్లుగా నటించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ద్విభాషా భారీ చిత్రంలో దర్శకుడు, తమిళ నటుడు, హీరో ఎస్.జె.సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మరో తమిళ యంగ్ హీరో, 'ప్రేమిస్తే' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరో భరత్ మరో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ హీరోగా వచ్చిన 'వరుడు' చిత్రంలో ఆర్య విలన్‌గా నటించాడు. బన్నీనే నటించిన 'సరైనోడు' చిత్రంలో తెలుగు వాడైనప్పటికీ తమిళ హీరోగా గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ'చిత్రంలో అరుణ్‌విజయ్ ప్రతినాయకునిగా చేశాడు. ఇక 'ఈగ' చిత్రంలో కన్నడ స్టార్ సుదీప్ అతి కీలకమైన విలన్ రోల్‌ను పోషించి, తన నట విశ్వరూపాన్ని చూపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇది నయా ట్రెండ్‌గా మారింది.