ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయం తెలిసిందే. కాగా దీనిని మొదట్లో అందరూ స్వాగతించారు. నల్లధనాన్ని అరికట్టడంలో ఇది కేవలం మొదటి చర్యేనని, కాబట్టి దేశ ప్రజలందరూ నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపాలని ప్రధాని పిలుపునిచ్చారు. మోదీ తీసుకున్న చర్య సరైనదే అని విద్యావంతులైన ఎవరైనా అంగీకరిస్తారు. కానీ సామాన్య ప్రజలు నోట్ల కోసం పడుతున్న కష్టాలు, ముందస్తు ప్రణాళిక లోపించిందన్న దానిపై మాత్రం ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పలు చోట్ల నల్లకుబేరుల వద్ద ఉన్న కోట్లాదిరూపాయల కొత్త నోట్లను చూసి, రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులు, ఉన్నతాధికారులు నుంచి సామాన్య బ్యాంకు ఉద్యోగులు, పోస్టాఫీస్ సిబ్బంది వరకు అవినీతికి పాల్పడి ఇలా మోదీ నిర్ణయానికి తూట్లు పొడుస్తుండటం, గాలిజనార్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి వంటి ప్రభుత్వ అనుకూల వ్యక్తుల నుండి ఇలా భారీ మొత్తంలో కొత్త నోట్లు బహిర్గతం కావడం కూడా చర్చనీయాంశం అయింది. మరోవైపు డిజిటల్ లావాదేవీలు ఎక్కువైతే భారతదేశంలో హ్యాకింగ్‌లు పెరిగిపోతాయని, మనదేశంలో ఈ విషయంలో అంత సెక్యూరిటీ లేదనే వాదనలు కూడా ఉన్నాయి.
తాజాగా పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ నోట్ల రద్దుపై చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. మనకు కనిపించేవన్నీ నల్లధనం కాదని, వార్ధా వంటి విపత్తులు వచ్చి, కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఫెయిలయితే ప్రజల సంగతి ఏమిటి? అని రేణు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఓ నెటిజన్ 'మోడీ లెస్ క్యాష్ సొసైటీ అని చెప్పారే గానీ క్యాష్‌లెస్ సొసైటీ అని చెప్పలేదని, చిన్న నోట్లు అందుబాటులో ఉంటాయి కనుక వాటిని వాడుకోవచ్చని స్పందించాడు.దీనికి రేణు మోడీ చేసిన క్యాష్ లెస్ సొసైటీ' ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. ఈ విషయంలో ఎక్కువ మంది నెటిజన్లు రేణు ట్వీట్‌ను తప్పుపడుతున్నారు. అయినా రేణు ట్వీట్‌లో కూడా కాస్త వాస్తవం ఉందని ఒప్పుకోవాల్సిందే.