ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలం అయినప్పటికీ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' చిత్రంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఓ సెటైరిక్ పాత్రను పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన కమెడియన్ పృథ్వీ. కాగా బ్రహ్మానందంకు క్రేజ్ తగ్గడం, సునీల్ తరహా కమెడియన్ హీరో పాత్రలకే పరిమితం కావడం, వేణుమాధవ్ వంటి హాస్యనటులు పరిశ్రమకు దూరం కావడం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు వంటి కమెడియన్ల హఠాన్మణంతో పృథ్వీ దశ తిరిగింది. ముఖ్యంగా 'లౌక్యం' చిత్రంతో ఆయనకు కమెడియన్‌గా స్టార్‌స్టేటస్ వచ్చింది. అక్కడి నుండి ఆయన కోసమే దర్శక రచయితలు ప్రత్యేక పాత్రలను సైతం సృష్టిస్తున్నారు. కాగా ఆయన దాదాపు హీరో వంటి పాత్రను పోషించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం రేపు విడుదలకానుంది.
ఈ చిత్రంలో ఆయన సరసన ఏకంగా సలోని నటించడం విశేషం. త్వరలో ఆయన 'మల్లప్ప' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నానని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, తాను త్వరలో కోలీవుడ్ స్టార్ అజిత్ నటించే చిత్రంలో ఓ సెన్సేషన్ పాత్రను పోషిస్తున్నానని, ఈ చిత్రంలో తన పాత్ర మూగవాడి పాత్ర అని తెలిపాడు. ఈ చిత్రంలో చివరి సీన్‌లో తాను చొక్కా విప్పి సిక్స్‌ప్యాక్ చూపించే పాత్రను చేస్తున్నానని, ఆ సీన్ సినిమాకు చాలా కీలకం కావడంతో అజిత్ సలహాపై తాను సిక్స్‌ప్యాక్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాను హీరోగా నటించే 'మల్లప్ప' చిత్రంలో కూడా తన పాత్రకు సిక్స్‌ప్యాక్ అవసరం కావడంతో దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానన్నాడు. 'సౌఖ్యం' చిత్రంలో శివలింగాన్ని మోస్తూ 'బాహుబలి'లో ప్రభాస్‌కు పేరడీగా చేసిన సీన్‌లో తాను సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా అర్దమవుతుందని చెప్పుకొచ్చాడు.
కాగా 'లౌక్యం' చిత్రానికి ముందు తాను నటించిన చిత్రాలలోని పోస్టర్స్, టీజర్స్‌లో తాను కనిపించి, కనిపించకుండా ఉండేవాడినని, కానీ ప్రస్తుతం మాత్రం పబ్లిసిటీలో తనకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, ముఖ్యంగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం పోస్టర్స్‌లో, ట్రైలర్స్‌లో తానే ఎక్కువగా కనిపిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నాడు. 50 ఏళ్ల పైబడిన వయసులో కూడా పృథ్వీ సిక్స్‌ప్యాక్ కోసం కష్టపడుతుండటం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా మరో విశేషం ఏమిటంటే.. పెద్దనోట్ల రద్దు తర్వాత సినిమా నిర్మాతలు రెమ్యూనరేషన్స్ విషయంలో, సినిమా రిలీజ్ విషయంలో తీవ్ర ఆర్దిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్ర రిలీజ్‌లో కూడా తన నిర్మాత ఆర్దిక ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి తన రెమ్యూనరేషన్‌లో కేవలం సగం మాత్రమే తీసుకున్నాడని తెలుస్తోంది. దాంతో ఆయన ఔదార్యం చూసి ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.