నిజానికి వాస్తవిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా బెంగాళీ, మలయాళ చిత్ర పరిశ్రమలను చెప్పవచ్చు. సహజసిద్దమైన చిత్రాలకు పెద్ద పీట వేసే మలయాళ ఇండస్ట్రీలో షకీలా తరహా అడల్ట్ చిత్రాలు కూడా ఆదరణ పొందుతుంటాయి. దీంతో మలయాళ సినీ ప్రేక్షకుల టేస్ట్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం మల్లూవుడ్ కమర్షియల్, సినిమాటిక్, మాస్ చిత్రాలను ఆకట్టుకుంటోంది. బన్నీ నటించిన కొన్ని చిత్రాలు అక్కడ కూడా విజయవంతం కావడమే దీనికి ఉదాహరణ. దీనికితోడు ఇప్పుడు మరో చిత్రం ద్వారా ఈ విషయం మరోసారి బహిర్గతమైంది. వైవిధ్యభరిత చిత్రాలను ఆదరించే మలయాళ ప్రేక్షకులు ఇటీవల మోహన్‌లాల్ హీరోగా వచ్చిన పక్కా మాస్ చిత్రం 'పులిమురుగన్'ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే తెలుగులో కూడా 'మన్యం పులి'గా విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో ఓ చిత్రం 50కోట్లు వసూలు చేస్తేనే అది పెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రం కింద లెక్క. అటువంటిది 'పులిమురుగన్' ప్రపంచ వ్యాప్తంగా 150కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆశ్చర్యపరుస్తోంది. సినిమా విడుదలకు ముందే 15కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం థియేటికల్ రన్ ద్వారా 135కోట్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం సౌత్‌ఇండస్ట్రీలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డులకెక్కింది. మొత్తం మీద మలయాళ ప్రేక్షకుల అభిరుచిలో ఇలాంటి మార్పు వస్తుండటం వాస్తవిక చిత్రాలను ఇష్టపడే సినిమాభిమానులకు కూడా బాధాకరమనే చెప్పాలి.