తన కెరీర్ మొదట్లో దర్శకుడు మారుతి తీసిన చిత్రాలు కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ అడల్ట్ చిత్రాల దర్శకునిగా, నిర్మాతగా, సమర్పకునిగా ఆయనపై బూతు ముద్రపడింది. ఇక తాను వెనుక ఉండి అన్నీ తానై నడిపించిన 'ప్రేమకథాచిత్రమ్' క్లీన్ హర్రర్ ఎంటర్‌టైనర్ మూవీస్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టినప్పటికీ ఎందువల్లో కానీ మారుతి దర్శకునిగా తన పేరు వేసుకోలేదు. సినిమా మంచి విజయం సాధించిన తర్వాత మాత్రం మీడియా ముందుకు వచ్చి తానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని చెప్పుకున్నాడు.
ఇక ఆయన క్లీన్ చిత్రాలు తీసి కూడా హిట్ కొట్టగలనని నిరూపించిన చిత్రంగా 'భలే భలే మగాడివోయ్'ని చెప్పవచ్చు. క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి, నానిని స్టార్‌ని చేసింది. దీంతో ఇక మారుతి దశ తిరిగిందని అందరూ భావించారు. ఈ చిత్రం సాధించిన విజయంతో ఆయనకు ఏకంగా సీనియర్‌స్టార్ వెంకటేష్-నయనతారల కాంబినేషన్‌లో 'బాబు బంగారం' వంటి చిత్రం డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని మారుతి సద్వినియోగం చేసుకోలేకపోయాడనే చెప్పాలి. దాంతో మరలా ఆయన పరిస్థితి మీడియం రేంజ్ హీరోల దగ్గరకు వచ్చి ఆగింది.
నానికి బాగా డిమాండ్ పెరగడంతో ఇప్పుడు మారుతి దృష్టి మరో మినిమం గ్యారంటీ హీరోగా ఎదుగుతున్న శర్వానంద్‌పై పడింది. 'రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాలతో కమర్షియల్ హీరోగా మారి తన మార్కెట్‌ను 15కోట్ల వరకు పెంచుకున్న శర్వానంద్ ఇప్పుడు మారుతి పాలిట 'మహానుభావుడు'గా మారాడు. త్వరలో మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ వంటి మంచి బేనర్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రానికి మారుతి 'మహానుభావుడు' అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నాడు. తన ప్రతి చిత్రంలోనూ హీరో క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసే మారుతి ఈ చిత్రంలో శర్వానంద్‌ను బాగా డబ్బున్న ఓ కుర్రాడిగా, బ్రాండ్ ఐటమ్స్ అంటే పిచ్చి ఎక్కువగా ఉండే యువకునిగా చూపించనున్నాడట. ఇలాంటి ఓ కుర్రాడు సింపుల్‌గా ఉండే ఓ అమ్మాయితో ప్రేమతో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం మారుతికి మరో అగ్నిపరీక్షగా మారింది. కాగా ప్రస్తుతం శర్వానంద్ దిల్‌రాజు బేనర్‌లో చేస్తున్న 'శతమానం భవతి' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. మరోపక్క ఆయన నటిస్తున్న 25వ చిత్రంగా బారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో చంద్రమోహన్ అనే నూతన దర్శకునితో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.