గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఓ స్టార్ చిత్రం విడుదలైందంటే ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీలవర్స్ అందరికీ తెలిసిపోతోంది. దాంతో ఆ చిత్రం ఏదో చిత్రానికి కాపీ అని, ఫలానా చిత్రం నుండి ఫలానా సీన్స్‌ను లేపేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. దాంతో ఆ చిత్రం ఒరిజినల్ వెర్షన్ మేకర్స్‌కు కూడా ఈ విషయాలు తెలిసిపోతుండటంతో ఆయా కాపీచిత్రాల మేకర్స్‌కు కాపీరైట్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా కరణ్‌జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో పాటు షారుఖ్‌ఖాన్ కూడా భాగస్వామిగా నిర్మించిన లోబడ్జెట్ హిట్ మూవీ 'డియర్ జిందగీ'కి ఇప్పుడు అవే సమస్యలు ఏర్పడ్డాయని సమాచారం. 'ఇంగ్లీష్.. వింగ్లీష్' చిత్రంతో దర్శకురాలిగా అందరినీ ఆకట్టుకున్న గౌరీషిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్, అలియాభట్‌లు నటించారు. ఈ చిత్రం కెనడియన్ మూవీ 'బీయింగ్ ఎరికా' చిత్రానికి కాపీ అని చిత్రం విడుదల కాకముందు నుంచే విమర్శలు వచ్చాయి. ఇక నవంబర్25న ఈ చిత్రం విడుదలైన తర్వాత ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. కాగా ఈ విషయం తెలుసుకున్న కెనడియన్ ఓరిజినల్ వెర్షన్ మేకర్స్ నిర్మాతలు కాపీరైట్ చట్టం కింద నోటీసులు పంపారని బాలీవుడ్ సమాచారం. కానీ ఈ విషయాన్ని దర్మప్రొడక్షన్స్ సంస్థతో పాటు ఈ చిత్ర దర్శకురాలు గౌరీషిండే కూడా ఖండిస్తున్నారు. కానీ పట్టుబడిన తర్వాత అందరూ ఇలాగే వాదిస్తారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో పలువురు షార్‌ఖ్‌ను కూడా తప్పుపడుతున్నారు.