వివాదాస్పద వ్యక్తి, నిత్యం ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ, వార్తల్లో ఉండటంలో తన గురువు దాసరిని మించిన వాడు ఆయన శిష్యుడు మంచు మోహన్‌బాబు. అయితే ఆయన వివాదాస్పదంగా మాట్లాడే విధానం విషయాన్ని కొందరు ఒప్పుకోరు. తమ అభిమాన నటుడు నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడుతాడని, అందుకే ఆయన చాలా గ్రేట్ అని వాదిస్తుంటారు. కాగా సినీ ఫీల్డ్‌లోని పలు భాషల్లోనే కాక రాజకీయరంగంలో కూడా ఆయనకు మంచి మంచి స్నేహాలున్నాయి. దాసరి, స్వర్గీయ ఎన్టీఆర్, రజనీకాంత్, పరిటాల రవి.. వంటి వారు వీరిలో కొందరు. ఇక ఆయన తన స్నేహాలను, పరిచయాలను వాడుకోవడంలో సిద్దహస్తుడనే పేరుంది. ఆయన తాను నటించిన 'అధిపతి', తన కుమారుడు విష్ణుతో తీసిన 'కృష్ణార్జున' చిత్రాలలో తాను నటించడానికి మోహన్‌బాబు బలవంతమే కారణమని స్వయంగా ఓసారి నాగార్జున కూడా ఒప్పుకున్నాడు. అలాగే తనకున్న తెలివితో తన కూతురు లక్ష్మీప్రసన్న, కుమారుడు మనోజ్‌లు కలిసి నటించి, నిర్మించిన 'ఊకొడతారా.. ఉలిక్కిపడతారా'లో బాలయ్యను గెస్ట్‌గా ఒప్పించడానికి చక్రం తిప్పింది ఆయనే అనే టాక్ ప్రచారంలో ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక తనకు స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన రాజ్యసభ సభ్యుడు కావడమే కాదు.. ఎన్టీఆర్ చివరిరోజుల్లో ఆయనకున్న క్రేజ్‌ను వాడుకొని 'మేజర్ చంద్రకాంత్' చిత్రాన్ని తన సొంతంగా నిర్మించి, బాగానే సొమ్ము చేసుకున్నాడు. ఇక పరిటాలతో తనకున్న పరిచయాలతో ఆయన పలువురిని పరిటాల పేరు చెప్పి భయభ్రాంతులకు కూడా గురిచేసే వాడని ఆయన ప్రత్యర్దులు అంటూ ఉంటారు. ఇక రజనీకాంత్‌తో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. తాను ఆర్థికంగా బాగా లేని సమయంలో ఆయన రజనీ నుండి ఎన్నోసార్లు ఆర్ధికసాయం పొందాడంటారు. ఇక రెండు దశాబ్దాల కిందట వరుసగా తన సొంత బేనర్‌లో పలు హిట్ చిత్రాలను నిర్మించి, నటించిన ఆయన కెరీర్‌లోనే 'పెదరాయుడు' అత్యంత పెద్దహిట్. ఆ చిత్రం రెండు దశాబ్దాల కిందట సంచలనం సృష్టించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో భానుప్రియ, సౌందర్యలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేయగా, రజనీ అతిధిపాత్ర పోషించాడు. ఈ చిత్రం తమిళ 'నట్టమై' చిత్రానికి రీమేక్. ఈ చిత్రం గురించి తాజాగా మోహన్‌బాబు మాట్లాడుతూ, ఈ చిత్రం తమిళ వెర్షన్ చూసిన రజనీ తనను ఆ చిత్రం రీమేక్ రైట్స్ కొనమని సలహా ఇచ్చి నా చేత కొనివ్వడమే కాక.. ఆ చిత్రంలోని పాపారాయుడు పాత్రను తానే చేస్తానని చెప్పి, రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ ఆయనకు పారితోషికంగా డబ్బులు ఇవ్వకుండా వేరే రూపంలో ఇచ్చేశానన్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో కూడా రజనీ తనకు షూటింగ్ కోసం డబ్బులు ఇచ్ఛేవాడని తెలిపాడు. కాగా ఈ చిత్రం సమయంలో ఆయన సీనియర్ నటి జయంతిని కూడా కొట్టాడనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం 200రోజుల ఫంక్షన్‌ను ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల సమక్షంలో జరిపిన ఆయన ఈ చిత్రం ద్వారా ఆర్ధికంగా పుంజుకున్నాడు. కానీ ఓసారి రజనీ స్వయంగా మీడియా సమక్షంలో మాట్లాడుతూ, తాను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో స్థలాలు కొనాలని భావించానని, కానీ మోహన్‌బాబు ఈ కొండలు, గుట్టల్లో కొనడం వేస్ట్ అని సలహా ఇచ్చి, తాను మాత్రం కొనుకున్నాడని బాధపడిన సంఘటన గుర్తుండే ఉంటుంది. వీటన్నింటిని విశ్లేషించే ఆయన ప్రత్యర్ధులు 'వాడకం'లో కలెక్షన్ కింగ్‌ను మించినవాడు లేరంటూ విమర్శలు గుప్పిస్తుంటారు.