ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో 30కోట్ల వరకు మార్కెట్ పెంచుకుని, నేచురల్ స్టార్‌గా వరుస విజయాలతో దూసుకెళ్లుతోన్న హీరో నాని. ఇప్పుడు ఆయనకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆయనతో చిత్రం చేస్తే లాభాలు ఖాయమని నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆయన నటించిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ', 'జెంటిల్‌మన్' చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 'మజ్ను' చిత్రం విషయానికి వస్తే యావరేజ్ దగ్గర అగిపోయింది. అకాల వర్షాలు రాకుంటే ఈ చిత్రం కూడా లాభాలను గడించేదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ఇక తాజాగా నాని దిల్‌రాజు నిర్మాతగా, 'సినిమా చూపిస్త మావా' దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'నేను.. లోకల్'. ఈ చిత్రంలో నాని సరసన సెన్సేషనల్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా, సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేస్తామని దిల్‌రాజు మొదట్లో చెప్పారు. కానీ ఈ చిత్రం ఆ తేదీన విడుదల కావడం లేదనేది పక్కా సమాచారం. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ లేట్ కావడం వల్ల ఈ చిత్రం విడుదల వాయిదాపడింది. దిల్‌రాజు ఈ నెల 16న విడుదల కానున్న 'నాన్న..నేను.. నా బోయ్‌ఫ్రెండ్స్' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో కేవలం వారం గ్యాప్‌లో 'నేను.. లోకల్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయడు. ఇక సంక్రాంతికి వద్దామంటే ఆ రేసులో దిల్‌రాజు నిర్మిస్తున్న మరో చిత్రం 'శతమానం భవతి' రిలీజ్ కానుంది. సంక్రాంతి సెంటిమెంట్ శర్వానంద్‌కు బాగా కలిసి వస్తుండటంతో ఈ చిత్రాన్ని అప్పుడేేే రిలీజ్ చేయమని, తన చిత్రాన్ని వాయిదా వేయమని నాని దిల్‌రాజుకు చెప్పాడని సమాచారం. వాస్తవానికి 'నేను లోకల్'ను సంక్రాంతి బరిలో దింపి, 'శతమానం భవతి' చిత్రాన్ని వాయిదా వేస్తారని కూడా చాలా మంది భావించారు. కానీ నాని మాత్రం తన స్నేహితుడైన శర్వానంద్ కోసం తన చిత్రాన్ని వాయిదా వేసుకొని త్యాగం చేశాడని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం సంక్రాంతి రేసులో ఇద్దరు టాప్‌హీరోలు పోటీపడుతున్న సమయంలో తాను రావడం ఇష్టం లేక ఆలస్యమైనా సరే సోలోగా వచ్చి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే నాని ఇలా చేశాడంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం 'నేను.. లోకల్' చిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ ఆదే రోజు మరో సీనియర్ స్టార్ వెంకటేష్ 'గురు' గా వస్తున్నందున ఈ చిత్రానికి ఫిబ్రవరి 3న రిలీజ్ డేట్ లాక్ చేశారంటున్నారు. మొత్తానికి దిల్‌రాజుతో పాటు తన తెలివితేటలను కూడా నాని బాగా చూపించాడని అర్ధమవుతోంది.