దివంగత ముఖ్యమంత్రి జయలలిత సంస్మరణ సభలో ప్రముఖ నటుడు రజనీ కాంత్ మాట్లాడుతూ.. ఎమోషన్ కు గురయ్యాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందరూ లోలోపల అనుకుంటున్న రహస్యాన్ని రజనీ కాంత్ బయటపెట్టేశాడు. 1996లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం తాను చేసిన వ్యాఖ్యలవల్లే జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓడిపోయిందని రజనీకాంత్ వెల్లడించాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, నటుడు, రచయిత అయిన చో రామస్వామి సంస్మరణ సభలో రజనీ మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. కాగా ఆ ఎన్నికల్లో తాను, జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ఘటనను తల్సుకుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుందని రజనీ వెల్లడించాడు. కాగా ఆ ఎన్నికల సమయంలో రజనీ కాంత్ ఏమన్నాడంటే.. ఇక్కడ జయలలితగాని మళ్లీ ఆధికారంలోకి వస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడని రజనీ ఘాటు విమర్శ చేశాడు.
అయితే ఈ సంస్మరణ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ... జయలలితను కోహినూర్ వజ్రంగా అభివర్ణంచాడు. ప్రస్తుత సమాజం పురుషాధిక్యతతో నడుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో ఎన్నో ఆటుపోట్లకు గురై, కష్టాలకు ఎదురు నిల్చి జయలలిత అత్యున్నత స్థానానికి చేరుకున్నదని, ఆ విధంగా ప్రజల్లో చిరకీర్తిని సంపాదించుకుందని రజనీ వివరించాడు. ఎప్పటికప్పుడు జయలలిత అధిగమించిన సవాళ్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయని రజనీ తెలిపాడు. జీవితంలో తనకు ఎదురైన కష్టాలను అధిగమించడం నుండే తను మెట్టుకు మెట్టుకు ఎదుగుతూ వచ్చిందని, అలా ఆమె ఉన్నత శిఖరాను అధిరోహించిందని వెల్లడించాడు. ఈ సందర్భంగా రజనీకి, జయలలితకు మధ్య జరిగిన ఒక ఆశ్యర్యానికి గురి చేసే సంఘటన గురించి తెల్పాడు. తమ ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ కూడా తన కుమార్తె వివాహానికి జయలలిత హాజరుకావడంతో తనకు చాలా ఆశ్యర్యమేసిందని తెలిపాడు రజనీ కాంత్. అప్పట్లో తన కుమార్తె పెళ్ళికి ఆహ్వానించడం కోసం జయలలిత అపాయింట్ మెంట్ చాలా బరువెక్కిన హృదయంతో కోరానని, అయితే కోరగానే ఆహ్వానించి, ఎన్నికార్యక్రమాలున్నా పెళ్ళికి తప్పకుండా వస్తానని చెప్పిందని వివరించాడు రజనీకాంత్. ఇలా జయలలిత తన జీవితంలో ప్రతి క్షణాన్ని సవాల్ గా స్వీకరించిన ఆమె తన రాజకీయ గురువు, ఆరాధ్యదైవం అయిన ఎంజీఆర్ ను మించిపోయిందని వివరించాడు రజనీకాంత్. కాగా ఈ సంస్మరణ సభలో దక్షిణాదికి చెందిన పలువురు సినీ తారలు పాల్గొన్నారు.