ఎందరో లెజెండరీ సంగీత దర్శకులు తెలుగు సినీ పరిశ్రమకు విశిష్ట సేవలు అందించి, తమ అద్బుతమైన సృజనాత్మకతతో తెలుగు సినీ సంగీత వినీలాకాశంలో వెలుగొందారు. దేశ విదేశీ సంగీతాభిమానులను కూడా తమ ప్రతిభతో సమ్మోహితులను చేశారు. కానీ నేటి తరం వారు సంగీతం విషయంలోనే కాదు... సృజనాత్మకతకు పెద్దపీట వేసే సినీ ప్రపంచంలో వేరే వారి మేథస్సును, వారి కష్టాన్ని తాము చౌర్యం చేస్తూ, గొప్పలు పోతుంటారు. కాగా అతి పిన్న వయసులోనే సంగీత దర్శకునిగా 'దేవి' చిత్రానికి మ్యూజిక్ అందించి, ఆ తర్వాత అప్రతిహతంగా వరుస సంచలనాలతో హోరెత్తిస్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు దేశంలోని సంగీత దర్శకుల్లో ఓ మంచి క్రియేటర్‌గా ఎంతో పేరుంది. ఆయనకు తెలుగునాటనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా ఎందరో సినీ సంగీతాభిమానులు ఉన్నారు. ప్రస్తుతం దేవిశ్రీ హవా టాలీవుడ్‌లో నడుస్తోంది. ఆయనకు పోటీగా ఎదిగిన తమన్‌కు కూడా పలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి.. వస్తున్నాయి. కానీ తమన్‌పై మాత్రం కాపీ మాస్టర్ అనే చెడ్డపేరు పడిపోయింది. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు దేవిశ్రీపై పెద్దగా విమర్శలు లేవు.
కాగా ప్రస్తుతం దేవిశ్రీ సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన 'ఖైదీ నెంబర్150'కి సంగీతం అందిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రం తొలి ట్రైలర్ విడుదలై విశేష స్పందన రాబడుతోంది. కాగా ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచిన అంశాలలో రత్నవేలు అందించిన ఫొటోగ్రఫీతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద ఎస్సెట్‌గా నిలిచి హైలైట్ అయిందని పామరుల నుండి, విశ్లేషకుల వరకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ నేటి ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఏ విషయమైనా అందరికీ వెంటనే అర్దమైపోతుంది. 'ఖైదీ నెంబర్150' ట్రైలర్‌కు దేవిశ్రీ ఇచ్చిన సంగీతం ఇటీవల సల్మాన్‌ఖాన్ నటించిన సంచలన చిత్రం 'సుల్తాన్' ట్రైలర్‌కు వాడిన సంగీతానికి కాపీగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటి ట్రైలర్స్ మ్యూజిక్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రెండు ట్రైలర్స్ సంగీతాలను విన్న వారికి 'సుల్తాన్' ను దేవిశ్రీ కాపీ కొట్టాడని స్పష్టంగా అర్దమైపోతోంది. దీంతో ఎంతోకాలంగా దేవిశ్రీ సంగీత ప్రతిభను మెచ్చుకుంటున్న పలువురు సంగీతాభిమానులు దేవిశ్రీ ఇలా కాపీ కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదేమిటి .. దేవిశ్రీ.. అంటూ ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.