కొరటాల శివ స్వతహాగా రచయిత... కానీ రచయితగా తనను వాడుకొని వదిలేస్తున్న దర్శకుల తీరు చూసి బాధపడి, రచయితగా సంతృప్తి చెందలేకపోయాడు.దాంతో తానే తన కథలను తీయాలని భావించి దర్శకునిగా మారాడు. అలా మారిన తర్వాత ఆయన ప్రభాస్‌తో 'మిర్చి', మహేష్‌బాబుతో 'శ్రీమంతుడు', ఎన్టీఆర్‌తో 'జనతాగ్యారేజ్' వంటి చిత్రాలు తీసి, ఆయా హీరోల కెరీర్‌లలోనే అతి పెద్ద హిట్స్‌ను ఇచ్చాడు. ఈ చిత్రాలన్నీ తాను సొంతంగా రాసుకున్న కథలతోనే చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో అతి తక్కువ సమయంలోనే రెండోసారి జతకట్టి డివివి దానయ్య నిర్మాతగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' అనే టైటిల్‌ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రిజిష్టర్ కూడా చేయించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పవర్‌ఫుల్ హిట్ మూవీ 'సింహా' స్టోరీ తనదేనని, కనీసం ఆ చిత్రం రైటర్‌గా తనకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఇన్‌డైరెక్ట్‌గా తన బాధను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసినిమా ఫీల్డ్‌లో పేరు రానంత వరకు, అవకాశాలు రానంతవరకు మాత్రమే అందరూ నీతులు చెబుతారు. కొద్దిగా పేరొచ్చిన తర్వాత తమను ఇతరులు ఎలా వాడుకుని వదిలేశారో, అలాగే తాము కూడా ఇతరులను వాడుకొని వదిలేస్తుంటారు. కాబట్టి ఇక్కడ 99శాతం మంది పైకి మాత్రమే మంచిగా మాట్లాడుతుంటారు. కానీ వారు చేసే రాజకీయాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇక్కడ గురువింద గింజ సామెతను మనం గుర్తుచేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌తో చేయబోయే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే 'భరత్ అనే నేను' చిత్రం స్టోరీ కూడా కొరటాలది కాదని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం కథ పెద్దగా పేరులేని దర్శక, రచయిత శ్రీహరి నాను అనే అతనిది అని తెలుస్తోంది. ఈయన కొరటాలకు బాగా సన్నిహితుడు. ఆయన గతంలో భూమిక నిర్మించి, విడుదలలోనే ఎన్నో ఇబ్బందులు పడ్డ 'తకిట...తకిట' చిత్రానికి దర్శకుడు.ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, హరిప్రియలు జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇక విషయానికి వస్తే శ్రీహరి నాను దగ్గర ఉన్న స్టోరీ కొరటాలకు బాగా నచ్చింది. దాంతో ఆయనకు కోటిరూపాయలు ఇచ్చి ఆ కథను తాను తీసుకున్నాడట. స్వతహాగా మంచి రచయిత అయిన కొరటాల ఈ కథను మహేష్‌బాబుకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి, దానికి తనదైన శైలిలో స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం టైటిల్స్‌లో అయినా తనకు గతంలో జరిగిన మోసాలు, వంచనల వంటివి జరగకుండా, సినిమా మూలకథ విషయంలో ఆ క్రెడిట్ శ్రీహరి నానుకు ఇస్తాడా? లేదా?అనేది ఇప్పుడు టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారింది.