ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీతో పవన్‌కు పడటం లేదని, ముఖ్యంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పవన్‌కు మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చాయనే పుకార్లు ఎక్కువయ్యాయి. వీటిని మెగాహీరోలు ఎన్నిసార్లు ఖండించినా ఇవి మరింతగా ఉగ్రరూపం దాల్చాయే గానీ సద్దుమణుగలేదు. తాజాగా మెగాస్టార్ తనయుడు చరణ్ కూడా తన బాబాయ్ పవన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, పవన్‌ను 'ధృవ' ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానిస్తే, పవన్ దానిని తిరస్కరించాడని, దాంతో చరణ్ ఏకంగా ఆ చిత్రం ఆడియో వేడుకనే రద్దు చేసి, ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశాడనే పుకార్లు కూడా వినిపించాయి. కాగా రామ్‌చరణ్‌ను ఆయన అభిమానులు చిరు బిరుదులోని 'మెగా'ను, పవన్ బిరుదులోని 'పవర్' ని కలిపి 'మెగాపవర్‌స్టార్' అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ పవన్‌పై అలిగిన చరణ్ తన బాబాయ్ నుంచి తాను తీసుకున్న 'పవర్' అనే పదాన్ని వద్దనుకున్నాడని, అందుకే తన తదుపరిచిత్రాలలో 'మెగాపవర్‌స్టార్'కు బదులుగా 'యంగ్ మెగాస్టార్' అనే పేరును వేసుకోనున్నాడని కూడా దుష్ప్రచారం సాగింది. కానీ 'ధృవ' చిత్రంతో చరణ్ ఈ పుకారు రాయుళ్లకు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రం టైటిల్ కార్డ్స్‌లో ఆయన తన బిరుదును యథాతథంగా 'మెగాపవర్‌స్టార్' అనే వేసుకొని, తన బాబాయ్‌పై తనకున్న ఆప్యాయతను చాటుకున్నాడు. దీంతో పుకారురాయుళ్ల నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్లయింది.