ఓ దర్శకుడి స్వప్నాన్ని నిజం చేసేందుకు ఆ చిత్ర నిర్మాతలు, యూనిట్, నటీనటులు మూడేళ్లు పడ్డ శ్రమకు, పెట్టిన ప్రతిపైసాకు విలువనిస్తూ తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం దేశంలోని అన్ని భాషల్లో ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో టాలీవుడ్ చిత్రాలపై ఉన్న చిన్న చూపును బద్దలు కొట్టి, ఈ చిత్రం డబ్బింగ్ రూపంలోనే అక్కడి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కాగా మొదటి పార్ట్‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేది అందరికీ సస్పెన్స్‌గా నిలిచి, ఈ చిత్రం సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూసేలా క్యూరియాసిటీ కలిగించడంలో సక్సెస్ అయింది. ఇటీవల ఒర్మాస్ మీడియా అనే సంస్థ బాలీవుడ్‌లో త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కొన్ని చిత్రాల పేర్లను ప్రకటించి, వాటిల్లో ఏ చిత్రం కోసం మీరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు? అనే సర్వేను నిర్వహించింది. దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీ, దర్శకదిగ్గజం, బాహుబలిని తన '2,0' ద్వారా మించిపోవాలని తన చిత్రంలో రజనీతో పాటు విలన్‌గా అక్షయ్‌కుమార్‌ను తీసుకొని, దేశంలోనే భారీ బడ్జెట్‌తో చిత్రం తీస్తున్న దర్శకుడు శంకర్ కూడా ఇలా షాక్ అయిన వారిలో ఉన్నారు. హిందీ సినీ ప్రేక్షకుల్లో 51 శాతం మంది తాము 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నట్లు తేల్చారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ నటిస్తున్న 'రాయిస్', సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్'; రజనీ '2.0' చిత్రాలన్నీ 'బాహుబలి' దరిదాపుల్లోకి కూడా రాకపోవడం సంచలనం సృష్టించి, ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా చర్చనీయాంశమైంది.