తనదైన శైలిలో ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రైజింగ్ స్టార్ నిఖిల్. 'స్వామిరా..రా'తో ఊపందుకున్న ఆయన కెరీర్ వరుస విజయాలతో సాగుతోంది. మధ్యలో కోనవెంకట్‌ని నమ్మి చేసిన రొటీన్ 'శంకరాభరణం' విషయంలో తప్ప ఆయన ప్లానింగ్ ఎక్కడా ఫెయిల్‌కాలేదు. ఇక నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డేర్‌గా విడుదలైన ఆయన తాజా చిత్రం 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సాధించిన విజయం పెద్దపెద్ద నిర్మాతలకు, స్టార్స్‌కు కూడా తమ చిత్రాలను కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో విడుదల చేయవచ్చనే కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. ఈ చిత్రం సాధించిన విజయంలో నిఖిల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. మంచి బలమైన కథ, కథనాలతో పాటు హర్రర్, కామెడీ వంటి అంశాలు కూడా సమపాళ్లలో రంగరించిన ఈ చిత్రం ఇప్పటికే 20కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. నిఖిల్, నందితా శ్వేతల అద్భుతమైన నటన, విఐ ఆనంద్ దర్శకత్వ ప్రతిభతో పాటు హెబ్బాపటేల్ కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇతర భాషా హీరోలను, దర్శకనిర్మాతలను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రం గురించి విన్న పలు భాషాల వారు దీని రీమేక్ రైట్స్ కోసం ఎంక్వైరీలు మొదలుపెట్టారు. తమిళంలో యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్‌తో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషా సినీ ప్రముఖులను, ముఖ్యంగా యువహీరోలను ఈ చిత్రం ఎంతగానో ఆకర్షిస్తోంది. దీంతో నిఖిల్ ఎవరు? ఆయన నటించిన గత చిత్రాలు ఏమిటి? అనే విషయాలను కూడా పలు భాషల వారు ఎంక్వైరీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈచిత్రం రీమేక్ రైట్స్‌కు కూడా అన్ని భాషల్లో భారీ డిమాండ్ ఏర్పడటం, ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీరేటుకు అమ్ముడుకావడం వంటివి చూస్తుంటే ఓవరాల్‌గా ఈచిత్రం ద్వారా నిర్మాతలకు 30కోట్ల వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.