ఒక చిత్రాన్ని ఏళ్లకు ఏళ్లు తీయడం, అనవసరమైన హంగులు, ఆర్భాటాలు చేసి, కోట్లాది రూపాయలతో భారీ సెట్టింగ్స్ వేసి, సినిమా బడ్జెట్‌ను రెండుమూడు రెట్లు పెంచి, నిర్మాతలను సరైన ప్లానింగ్ లేకుండా ఇబ్బందులు పెడతాడనే చెడ్డపేరు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్‌పై ఉంది. అందుకే ఆయన తీసే చిత్రాలు ఎంతగా హిట్టయినా, నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదనే విమర్శ కూడా ఆయనపై ఉంది. దాంతో బయటి నిర్మాతలు ఆయనకు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడానికి జంకుతుంటారు.దాంతో ఆయనే నిర్మాతగా కూడా మారి అనుష్క, అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో 'రుద్రమదేవి' వంటి భారీ చారిత్రక చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించాడు. తన సొంత చిత్రం విషయంలో కూడా ఆయన పంథా మారలేదు. దాంతో ఈ చిత్రానికి డైరెక్టర్‌గా గుణకు మంచి పేరు వచ్చినా, ఆయన గట్స్‌ను అందరూ మెచ్చుకున్నా ఆయనకు, ఆ చిత్ర బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఆ తర్వాత ఆయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో తీస్తానని చెప్పి, ఆ టైటిల్‌ను రిజిష్టర్ కూడా చేయించాడు. అయితే హఠాత్తుగా ఆయన మరో చిత్రం వైపు దృష్టి పెట్టినట్లు సమాచారం. హిరణ్యకశ్యపుడు-భక్త ప్రహ్లాదుడు- శ్రీ నరసింహస్వామిల మద్య నడిచే పౌరాణిక గాధను 'హిరణ్యకశ్యప' పేరుతో తన గుణ టీమ్ వర్క్స్ బేనర్‌లో తీయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ చిత్రం టైటిల్‌ను కూడా ఆయన తాజాగా ఫిల్మ్‌చాంబర్‌లో రిజిష్టర్ చేయించాడు. రాక్షసరాజులైన ధుర్యోధనుడు, రావణుడు వంటి వారిని కూడా హీరోలుగా చూపిస్తూ, వారి కోణంలో చిత్రాలు తీసి ఘనవిజయం సాధించిన స్వర్గీయ ఎన్టీఆర్ దారిలోనే నడుస్తూ ఆయన ఈ చిత్రాన్ని హిరణ్యకశ్యపుడు కోణంలో తీయనున్నాడని తెలుస్తోంది. మనకు హిరణ్యకశ్యపుడు అంటే అలనాడు వచ్చిన 'భక్తప్రహ్లాద' వంటి క్లాసిక్ చిత్రంలో నటించిన ఎస్వీరంగారావే గుర్తుకొస్తారు. కాగా ఈ చిత్రాన్ని ఓ తమిళ హీరోను పెట్టుకొని, ఏకకాలంలో తెలుగు, తమిళభాషల్లో ద్విభాషాచిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. నేడు హాలీవుడ్, బాలీవుడ్‌లలో పాత క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఇలా దక్షిణాదిలో ఆ ప్రయత్నం చేయనున్న గుణశేఖర్ భవితవ్యం ఈచిత్రంపై ఆధారపడి ఉందని అంటున్నారు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన చేస్తోంది నిజంగా సాహసమనే చెప్పాలి.