చంద్రబాబు నాయుడు తన ప్రచార చిత్రాల విషయంలోనే గాక, ఎన్నికల సమయంలో పలు విషయాలలో సినీ పరిశ్రమలోని వ్యక్తుల సహాయసహకారాలు తీసుకుంటూ ఉండటం ఎప్పటినుంచో ఉన్నదే. గతంలో ఆయన రాఘవేంద్రరావు, ఇవివి సత్యనారాయణ వంటి పలువురు దర్శకులను ఇలాగే పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకున్నాడు. కాగా మొన్న జరిగిన రాజమండ్రి పుష్కరాలు, నిన్న జరిగిన కృష్ణా పుష్కరాల విషయంలో ఆయన దర్శకుడు బోయపాటి శ్రీను సలహాలు, సూచనలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం చంద్రబాబు దృష్టి 'బాహుబలి'లో మాహిష్మతి రాజ్యాన్ని అద్భుతమైన సెట్స్‌తో, విజువల్ ఎఫెక్ట్స్‌లో జీవం పోసిన జక్నన్నతో పాటు ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ తోట తరణి వంటి వారిపై పడింది. తాను ప్రతిష్టాత్మకంగా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఏపీ నూతన రాజధాని అమరావతి రూపకల్పన విషయంలో వారిని ఉపయోగించుకోవాలని నిర్ణయించాడు. కాగా ఈ విషయంలో ఆయన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ విషయంలో తాజాగా రాజమౌళిని కలిసి చర్చించారు. రాజమౌళికి గొప్ప విజన్‌తో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఎంతో పట్టు ఉంది. తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమలను పాలించిన పలువురు రాజుల చరిత్రలు, ఆయా రాజ్యాల నిర్మాణంలో వారు అనుసరించిన విధానాలపై సమగ్రమైన అవగాహన ఉంది. కాగా రాజమౌళిని కలిసిన అధికారులు ఆయనతో రెండు మూడు గంటల పాటు చర్చించారు. ముఖ్యంగా రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటి వాటి నిర్మాణాకృతులు ఎలా ఉండాలో కూడా రాజమౌళి ఈ సమావేశంలో ఉన్నతాధికారులకు ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు చేశాడని సమాచారం. ఆయన తన 'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రం విడుదల తర్వాత దీని కోసం మరింత సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.