ఒకప్పుడు సినిమా రంగంలో వారసులు పరిమితంగా ఉండేవారు. బయటి హీరోలే ఎక్కువగా ఉండేవారు. కానీ నేడు మాత్రం ఒకరి అండదండలతో ఆయా కుటుంబాలకు చెందిన అందరూ హీరోలవ్వాలని చూస్తున్నారు. వారికి ఉన్న అండదండలు, ఆర్దికబలం, బ్యాగ్రౌండ్, నిర్మాతల, అభిమానుల ప్రోత్సాహంతో వారిని సామాన్య ప్రేక్షకులపై బలవంతంగా రుద్దుతున్నారు. ఒక్కో ఫ్యామిలీకి చెందిన డజన్ల కొద్ది హీరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఆయా హీరోలను ఆడియన్స్ అలవాటు పడేదాకా వాళ్లపై బలవంతంగా రుద్దుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. సినిమా రంగంలోకి మా ఫ్యామిలీ నుండి మొదట నేను ప్రవేశించాను. ఇప్పుడు ఈ బిజినెస్‌పై ఆసక్తి కలగడంతో మా కుటుంబసభ్యులు కూడా ఇదే రంగంలోకి వస్తున్నారు. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. కాకపోతే ఓ కొత్త వారసుడికి ఉండే ప్లస్ పాయింట్ ఏమిటంటే... ఆ హీరో మొదటి చిత్రానికే ఆయా ప్యామిలీకి చెందిన అభిమానులు ఉంటారు. వారు మొదట సినిమాకు వెళతారు. వారిలో టాలెంట్, హార్డ్‌వర్క్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే ఎవరి కొడుకైనా, మనవళ్లయినా రాణించలేరు అని సమాధానం ఇస్తూ అందుకు ఉదాహరణగా బన్నీని చెప్పుకొచ్చాడు.
బన్నీ మొదటి చిత్రం 'గంగోత్రి' తర్వాత 'వీడేంటి హీరో' అన్నారు. నేను అలాగే భావించాను. కానీ 'ఆర్య'తో బన్నీ మ్యాజిక్ చేశాడు. తను ఈ చిత్రం కోసం ఎంత హార్డ్‌వర్క్ చేశాడో నాకు తెలుసు. ఇలా కష్టపడుతూ, టాలెంట్‌తో జీరో స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు అని సమాధానం ఇచ్చాడు. మరి 'గంగోత్రి'ని కూడా హిట్‌గా అల్లుగారు చెబుతుంటారు. మరి దీనికి సమాధానం ఏమిటి? వీడేంటి హీరో అని తనకే అనిపించిన వాడిని ఆయన రెండో చిత్రాన్నే తాను ఎందుకు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు? వంటి విషయాలు దిల్‌రాజుకే తెలియాలి. ఇక రామ్‌చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ బాగా కష్టపడుతున్నాడు.. హార్డ్‌వర్క్ చేస్తున్నాడు.. అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి, ఎవరైనా టాలెంట్ ఉంటేనే పైకొస్తారని కొసమెరుపునిచ్చాడు. అంటే చరణ్‌లో హార్డ్‌వర్క్ ఉందని చెప్పిన ఆయన టాలెంట్ కూడా ఉంది అని అనకుండా, కేవలం టాలెంట్ ఉన్న వారే పైకొస్తారని చెప్పడం ఏమిటని? మెగాభిమానుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి దిల్‌రాజు బన్నీని మాత్రం ఆకాశానికెత్తేశాడు.. అనేది వాస్తవం.