తెలుగు మెగాస్టార్ చిరంజీవి అనుభవం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు హెచ్చరిక (వార్నింగ్) లాంటిదే. మీడియా అభూత కథనాలు, అభిమానుల ఆరాటం, రాజకీయ పార్టీల ఆహ్వానం వల్ల టెమ్ట్ అయితే చేదు అనుభవం మిగులుతుందని చిరంజీవి నిరూపించారు. నంబర్ వన్ హీరోగా ఉన్నపుడు కెరీర్ పరంగా ఇక సాధించేది ఏదీ లేదని గ్రహించి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రజారాజ్యాం పార్టీ స్థాపించారు. 180 సీట్లు గెలిచి అధికార పీఠం దక్కించుకుందామని భావిస్తే 18 సీట్లు చాలు అని ప్రజలు తీర్పిచ్చారు. ఆ తర్వాత పార్టీని నడపలేక చేతులెత్తేసి, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి, రాజ్యసభ సభ్యత్వం ప్లస్ మంత్రి పదవి పొందారు. ఈ అనుభవ పాటాలు రజనీకి సరిగ్గా సరిపోతాయి. తమిళనాడులో రజనీ రాజకీయ అరంగేట్రం గురించి సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. తాజాగా జయలలిత మరణంతో మళ్ళీ ఊపందుకున్నాయి. రజనీ వయస్సు 65 సంవత్సరాలు. ఈ వయసులో జనంలో తిరిగే ఓపిక ఆయనకు లేదు. సినిమాల్లో గతంలోలాగా దూకుడు నటన ప్రదర్శించడం లేదు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? సినిమా అభిమానం ఓట్లు తెస్తుందా? పైగా తమిళనాడు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. అప్పటికీ ఆయన 69 ఏళ్ల వయస్సుకు చేరువవుతారు. ఇక అనూహ్య పరిణామాలు జరిగి మధ్యంతరం వస్తే మాత్రం దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి పార్టీ నెలకొల్పుతారా... అనేది తమిళ రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తున్న వారిలో ఆసక్తి రేగిస్తోంది. తెలుగునాట చిరంజీవి అనుభవాన్ని ఊటంకిస్తూ సన్నిహితులు మాత్రం రజనీ రాజకీయ ప్రవేశానికి మోకాలడ్డు వేస్తున్నారు. తమిళనాడులో కొంత కాలం రాజకీయాల్లో కొనసాగిన తర్వాతే ఎంజిఆర్, జయలలిత అధికార పీఠం దక్కించుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
రజనీకాంత్ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ప్రజల్లో తిరిగే నైజం అతడిలో లేదు. బిజెపి వంటి పార్టీ రజనీకాంత్ ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీనిపై సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.