మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తను జీవించి ఉండగానే తన పేరుమీద ఇంటర్నేషనల్ అవార్డు నెలకొల్పారు. చిత్ర పరిశ్రమలో నిష్ణాతులైన వారికి ఈ అవార్డులు ప్రతి ఏటా ప్రదానం చేయాలని భావించారు. కమిటీలో అక్కినేని కుటుంబసభ్యులతో పాటుగా టి.సుబ్బరామిరెడ్డి, డి.రామానాయుడు సభ్యులు. తన తదనంతరం కూడా ఈ అవార్డుల ప్రదానం జరగాలని ఆయన భావించారు. తొలుత 2006 నుండి 2013 వరకు వరుసగా అవార్డులు ఇచ్చారు. అక్కినేని 2014లో మరణించారు. ఆ సంవత్సరం అక్కినేని వారసుడు చొరవ తీసుకుని కమిటీ సూచన మేరకు అమితాబ్ బచ్చన్ కు అవార్డు అందజేశారు. ఆ తర్వాత అంటే 2015, 2016 సంవత్సరాలకు ఈ అవార్డు గురించి ప్రస్తావనే లేదు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 20 అక్కినేని పుట్టినరోజున అవార్డు బహుకరిస్తామని నాగార్జున ఒక సందర్భంలో చెప్పారు. కానీ రెండేళ్ళుగా అవార్డును మరిచారు.
ఈ ఇంటర్నేషనల్ అవార్డు కోసం కొంత మొత్తాన్ని అక్కినేని డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని పురస్కారంతో పాటుగా అందజేస్తారు. అంటే అవార్డు కోసం నిధుల సమస్యలేదన్నమాట. ప్రతి ఏడాది తన పేరు మీద అవార్డు ప్రదానం జరగాలని, దీనిని తన వారసులు కొనసాగిస్తారనే ఆశాభావాన్ని జీవించి ఉండగా అక్కినేని వ్యక్తం చేసేవారు. ఆయన కోరిక ఇప్పుడు మరుగున పడడం అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది.