ప్రస్తుతం వాస్తవ జీవితంలోని రియల్ హీరోల జీవిత చరిత్రలు బయోపిక్‌గా రూపొందుతూ బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. 'భాగ్ మిల్కా భాగ్, మేరికోమ్, తాజాగా ఎం.ఎస్ ధోనీ' వంటి చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర కూడా బయోపిక్‌గా రూపొందుతోంది. కాగా మరో క్రికెటర్ జీవిత చరిత్ర ఆధారంగా మరో బయోపిక్ చిత్రానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ క్రికెటర్ యువరాజ్‌సింగ్, తన రాకతో, హార్డ్ హిట్టింగ్‌తో ఎన్నో సంచలన విజయాలను భారత్‌కు అందించి, భారత్ ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు యువరాజ్‌సింగ్. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన ఈయన దాన్ని కూడా జయించి మరలా జాతీయ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం యువ క్రికెటర్ల రాకతో, ఫామ్‌లో లేని కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఈయన ఇటీవలే తన ప్రేయసిని పెళ్లాడి ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నాడు. యువీ తన కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో పలు ఎఫైర్లతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇలా ఈయన జీవితం సినీ స్టోరీకి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని భావించిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయన్ను కలిసి ఆయన బయోపిక్‌ను చిత్రంగా తీస్తామని చెప్పడం, దానికి యువి అంగీకరించడం కూడా జరిగిపోయినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తన బయోపిక్‌కు స్టార్ అక్షయ్‌కుమార్ అయితేనే సరిగ్గా సరిపోతాడని, ఆ హీరో డేట్స్ తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని యువి కండీషన్ పెట్టాడంటున్నారు. అదృష్టవశాత్తు ఈ పాత్రను చేయడానికి అక్షయ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్నిఎవరు? ఎవరి దర్శకత్వంలో రూపొందించనున్నారు? తదితర అంశాలన్నీ యువి హనీమూన్ ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత కన్‌ఫర్మ్ చేయనున్నారు.