ఎవరికైనా అధికారం చేదు కాదు.. ఒక్కసారి ఆ సీటు రుచి మరిగిన తర్వాత ఇక అధికార దాహాన్ని ఆపుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అందుకు ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం కూడా మినహాయింపు కాదు. కాగా ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన అమ్మ జయలలిత తన రాజకీయ వారసుడి విషయంలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చిందనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌లో, మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న అజిత్ అంటే అమ్మకు ఎంతో ప్రేమని అంటున్నారు. ఆయన కూడా పలు వేదికల్లో తనకు జయలలిత అమ్మ అని బహిరంగంగానే చెప్పాడు. జయ ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరేముందు ఓ రోజు అజిత్‌ను తన నివాసానికి పిలుచుకుని పార్టీలో వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తు నిర్మాణం వంటి వాటిపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. అలాగే అనారోగ్యానికి ముందుగానే ఆమె పార్టీ శ్రేణులకు కూడా అజిత్‌ను నాయకుడిగా తయారుచేయాలని ఆదేశించారని అమ్మకు సన్నిహితులు, నమ్మిన బంటు వంటి పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా పోయస్ గార్డెన్‌కు వెళ్లగలిగే అతి కొద్ది మందిలో అజిత్ ఒకరని అంటున్నారు. అందుకే జయ తాను రాసిన వీలునామాలో కూడా అజిత్ పేరును ఈ విషయంలో అధికారికంగా పేర్కొన్నారని, కానీ ముఖ్యమంత్రి పీఠం తమ ఇద్దరిలో ఎవరోఒకరి చేతుల్లోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చిన ఆమె నమ్మినబంటులు ఆ వీలునామాను రహస్యంగా ఉంచి మాయం చేయాలనే కుట్ర చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ చీలిపోయి, కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని, అమ్మలేని తమకు పార్టీలో భవిష్యత్తు లేదనే నిర్ణయానికి కొందరు వచ్చి సమయం కోసం ఎదురుచూస్తున్నారంటున్నారు. వీరిని ఆపగలిగి, పార్టీ చీలకుండా ఉండాలంటే అజిత్ వంటి బలమైన క్రేజ్ ఉన్న వ్యక్తి పార్టీకి అవసరమని కొందరు వాదిస్తున్నారు. నిజానికి అజిత్‌లో ఆ తెగింపు, పట్టుదల, ఏ విషయాన్నైనా ఇట్టే పసిగట్టగలిగిన నేర్పు, ప్రజాకర్షణ, మిస్టర్ క్లీన్ అనే పేరుతో పాటు గుప్తదానాలు చేసే సేవాతత్పరత కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరలో ఈ నిర్ణయాన్ని పార్టీ వర్గాలు ప్రజలు ముందుకు తేనున్నాయి. ఇక్కడ అమ్మ చేసిన తప్పల్లా కేవలం అజిత్ పేరును బహిరంగంగా ప్రకటించకుండా, కేవలం వీలునామాకే పరిమితం చేయడం, వాటిని కొందరు హస్తగతం చేసుకోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని, స్వర్గీయ ఎన్టీఆర్ మరణం తర్వాత ఏపీలో సంభవించినటు వంటి పరిణామాలే తమిళనాడులో కూడా ప్రస్తుతం నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది.