టాలీవుడ్ లో ఇద్దరు అగ్రహీరోలు ప్రతి విషయంలోనూ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. ఇద్దరి హీరోల మధ్య పోటీ కూడా ఆడియో వేడుకల నుండే ప్రారంభం కానుంది. వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 100 చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో రూపొంది ఆడియో వేడుకకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా రూపొందిన 'ఖైదీ నెం 150' కూడా పాటల వేడుకను జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వినాయక్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంది ఈ చిత్రం.
నందమూరి బాలకృష్ణ, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియోను తిరుపతి వేదికగా ఈ నెల 16వ తేదీన జరపాలని చిత్రబృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఆ తేదీన జరగాల్సిన ఆడియో వాయిదా పడి, 20-24 తేదీల మధ్యలో జరపాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే బాలకృష్ణ నూరవ చిత్రం ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా రానున్నాడని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బాబుకు కుదిరిన సమయంలోనే డేట్ ఫిక్స్ చేసుకునేలా చిత్రం సమాయత్తమవుతుంది. అంతే కాకుండా హేమమాలిని, వెంకయ్య నాయుడు కూడా ఈ నెల 16వ తేదీన అందుబాటులో ఉండకపోవడం కూడా ఈ వాయిదాకు కారణంగా తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రం ఆడియో వేడుకను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 25వ తేదీ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అంతేకాకుండా లక్ష్మీరాయ్ ప్రత్యేక గీతంలో నర్తించింది. అయితే చిరంజీవి, బాలకృష్ణ కెరీర్ లోనే మైలురాళ్ళుగా చెప్పుకొనే ఈ రెండు సినిమాలు పోటాపోటీగా అన్ని కార్యక్రమాలను జరుపుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలోనే ఉండటం అభిమానులను మరింత ఉత్కంఠతను రేపే విషయంగా చెప్పవచ్చు. ఈ ఇద్దరి ప్రముఖ హీరోల సినిమాలు రెండు ఒకే సమయంలో ఆడియో రిలీజ్ వేడుకను జరుపుకోవడం ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని రేపుతుంది. బాలకృష్ణ తిరుపతిలో ఆడియో వేడుకను జరుపుకోనుండగా, చిరంజీవి మాత్రం విజయవాడలో ఆడియో వేడుకను ఘనంగా జరుపుకొనేలా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.