డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాగార్జున, పవన్, మహేష్, యన్టీఆర్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలందరితో మంచి హిట్ సినిమాలు తీసి, టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో తను ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. పేరైతే ఉంది కానీ, దాన్ని నిలుపుకోవడమే పూరీకి కష్టమైన పనిగా మారుతుంది. ఒక స్టార్ హీరోకి హిట్ ఇచ్చిన పూరీకి..మరో స్టార్ హీరో నుండి పిలుపు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం పూరీ స్వయంకృతాపరాధం కూడా ఉంది. సినిమా క్వాలిటీ, కమర్షియల్ విలువలు, కథ మొదలగువాటిని చాలా లైట్‌గా తీసుకుని, ఎంత తక్కువ టైమ్‌లో సినిమాని చుట్టేయాలా అనే దానిపైనే ఈ మధ్య పూరి దృష్టి పెట్టడంతో.. స్టార్ హీరోలు పూరీ అంటే కొంచెం ఆలోచించే పరిస్థితికి వచ్చేశారు. రీసెంట్‌గా యన్టీఆర్‌తో సినిమా కన్ఫమ్ అనే స్థాయికి వచ్చి కూడా ఆగిపోయింది. అలాగే తను చెప్పిన కథల పట్ల చిరు, మహేష్‌ల స్పందనకు..పూరి హర్టవ్వడం వంటివి కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే పూరికి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన పవన్‌పై కామెంట్లు చేయడం, ఇకపై పవన్‌తో సినిమాలు చేయననే కోతలు కోయడం వంటివి కూడా పూరీ స్టార్‌డమ్ తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఎంతో టాలెంట్ ఉండి కూడా..గత కొంతకాలంగా ఒకే ధోరణిలో చిత్రాలు చేయడం కూడా పూరీ వైపు స్టార్ హీరోలు చూపు పడకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటి వల్లే పూరి చేసే ప్రతి సినిమాకి తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పూరి చిన్న హీరోలతో తన మార్క్ టైటిల్‌తో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. '3 కోతులు, 1 మేక' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయగల్గితేనే పూరి వైపు మళ్లీ స్టార్ హీరోలు చూసే అవకాశం ఉంది. లేదంటే మళ్లీ పూరి మొదటి నుండి మొదలుపెట్టాల్సిందే.