ప్రతి సినిమా హీరోలకు, దర్శనిర్మాతలకు ఎంతో కీలకమైనదే. కానీ కొన్ని చిత్రాలు మాత్రం కొందరికీ డూ ఆర్ డై సిట్యూయేషన్‌ను కలిగిస్తుంటాయి. 'ధృవ' నుండి తీసుకుంటే సంక్రాంతి వరకు ఈ కొద్ది కాలంలో విడుదలకు సిద్దమవుతోన్న కొన్ని పెద్ద చిత్రాలతో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా చాలా మందికి ఇలాంటి కీలకమైన పరిస్థితులను కల్పిస్తూ, విజయం సాధించక తప్పని పరిస్థితిని కలిగిస్తుండటం అందరిలో ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కూడా దీనికి తోడైంది. ఈనిర్ణయం తీసుకున్న తర్వాత విడుదలై మంచి విజయం సాధించిన నిఖిల్ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లో బడ్జెట్‌కు ఎక్కువ,.. మీడియం బడ్జెట్‌ను తక్కువగా తెరకెక్కినచిత్రం. అందునా పెద్ద స్టార్ కాని నిఖిల్ వంటి యంగ్ హీరో చిత్రం కాబట్టి.. దీనిని భారీ బడ్జెట్ చిత్రాలతో పోల్చకూడదు. భారీ చిత్రాలన్న తర్వాత బిజినెస్ నుంచి ప్రమోషన్స్, ఓపెనింగ్స్ అన్నీ భారీ రేంజ్‌లో ఉంటాయి. మరి మోదీ ఎఫెక్ట్ పెద్ద చిత్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో మోదీ నిర్ణయం తర్వాత విడుదలవుతున్న తొలి భారీ బడ్జెట్ చిత్రంగా 'ధృవ'ను చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నిర్మాతగా అల్లుఅరవింద్ చాణక్యానికి పెద్ద సవాల్ విసురుతోంది. ఈ చిత్రంపై బ్లాక్‌మనీ ఎఫెక్ట్ పడకుండా అల్లు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? బిజినెస్‌లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? అనే వాటిని మిగతా నిర్మాతలు ఎంతగానో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక హీరోగా రామ్‌చరణ్‌కు, దర్శకునిగా సురేందర్‌రెడ్డిలకు ఈ చిత్రం కీలకంగా మారింది.
ఆపై వచ్చే సూర్య 'ఎస్3' చిత్రం విషయంలో సూర్యది కూడా అదే పరిస్థితి. ఆయన్ను నమ్ముకొన్న నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఈ మధ్య చాలా చిత్రాలు కమర్షియల్‌గా నష్టాలనే మిగిల్చాయి. సూర్యకు కూడా గత రెండేళ్లుగా, మరీ ముఖ్యంగా తమిళంలో పెద్ద హిట్ లేదు. దీంతో ఈ చిత్రంతో తిరిగి తమిళ, తెలుగు భాషల్లో తన సత్తా చూపించాల్సిన అత్యవసర పరిస్థితి సూర్యకు ఏర్పడింది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇక ఈనెల 30న విడుదలవుతుందని భావిస్తున్న అల్లరి నరేష్ నటిస్తున్న 'ఇంట్లో దెయ్యం... నాకేం భయం' చిత్రం భారీ బడ్జెట్, స్టార్ హీరో నటించిన చిత్రం కాకపోయినా ఈ చిత్రం విజయంపై అల్లరోడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక సంక్రాంతికి విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిరుకు ఇప్పటికీ పూర్వపు క్రేజిక్, మ్యాజిక్ ఇప్పటికీ ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని తేల్చనుంది. ఇక ఈ చిత్రం నిర్మాతగా తొలి చిత్రమైన రామ్‌చరణ్‌కు, 'అఖిల్' వంటి డిజాస్టర్ తర్వాత మెగా అవకాశాన్ని పొందిన దర్శకుడు వి.వి.వినాయక్‌లకు కూడా అగ్నిపరీక్షే కానుంది. అలాగే నందమూరి బాలకృష్ణ కెరీర్ ఈమధ్య కుదురుగా సాగడం లేదు. 'సింహా, లెజెండ్' వంటి హిట్స్ ఉన్నప్పటికీ వరుస విజయాల సాధించలేక నిలకడగా లేని పరిస్థితుల్లో బాలయ్య ఉన్నాడు. ఆయన కెరీర్ ప్రస్తుతం ఒక హిట్.. మూడు ఫ్లాప్‌లుగా సాగుతోంది. ఇక సెన్సిబుల్ డైరెక్టర్‌గా తనను తాను నిరూపించుకున్నప్పటికీ దర్శకుడు క్రిష్‌కు కమర్షియల్ దర్శకునిగా మాత్రం పేరు రాలేదు. ఆయనకు తొలిసారిగా బాలయ్య వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ చిత్రం ద్వారా ఆ అవకాశం లభించింది. మరి దర్శకునిగా క్రిష్ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు? ప్రతిష్టాత్మక చిత్రంగా, బాలయ్య వందో చిత్రంగా రూపొందుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని ఏ తీరాలకు చేరుస్తాడు? అనేవి ఆసక్తికరం. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో క్రిష్ స్వయంగా ఈ చిత్రం నిర్మిస్తుండటంతో నిర్మాతగా కూడా ఈచిత్రం క్రిష్‌కు చావోరేవో తేల్చనుంది. మరి ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచిచూడాల్సివుంది.