తమిళనాడు సీఎం జయలలిత ఇక లేరు. అమ్మకు అంజలి ఘటిస్తూ చిన్నా ,పెద్దవారు అందరూ ట్వీట్స్ చేశారు. అంతేకాకుండా లక్షలాది తమిళ ప్రజలు ఆమెకు నివాళులు అర్పించేందుకు, జయలిత పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు క్యూ కట్టారు. ఇక తమిళ నటులు, టాలీవుడ్ ఇండస్ట్రీ నటులు కొంతమంది జయ పార్థివ దేహాన్ని సందర్శించుకుని కంట తడి పెట్టారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యామిలీతో అమ్మకి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ జయలలితకు నివాళులర్పిస్తూ ఒక సంచలనాత్మక ట్వీట్ చేశాడు.
కమల్ తన ట్విట్టర్లో 'అమ్మ మీద ఆధారపడి బతుకున్న వారి పట్ల తీవ్రమైన సానుభూతి' అంటూ సంచలనాత్మక ట్వీట్ చేశాడు. జయకు కమల్ కి అస్సలు పడదు అనే విషయం చాలా మందికి తెలుసు. వీరి మధ్యన చాల విషయాల్లో విభేదాలొచ్చాయి. డైరెక్టుగానే కమల్ హాసన్ జయపై యుద్ధం చేసేవాడు. జయలలిత కూడా కమల్ హాసన్ ని మూడు చెరువులు నీళ్లు తాగించిన ఘటనలు చాలానే వున్నాయి. మరి కమల్ వాటన్నిటిని మనసులో పెట్టుకునే జయలలిత మృతిపై సంతాప ట్వీట్ ని ఇలా వెటకారంగా చేశాడా? జయలలిత ప్రవేశపెట్టిన పథకాలపై, ఆమె చేసిన సేవలను అవహేళన చేస్తూ ఇలా కమల్ ట్వీట్ చెయ్యడం కరెక్ట్ కాదని కమల్ హాసన్ అభిమానులే అభిప్రాయపడుతున్నారు.
ఇలా కమల్ ట్వీట్ చేసి అమ్మని అవమానపర్చడం నచ్చని కమల్ అభిమానులు ఇప్పుడు కమల్ ని వ్యతిరేకిస్తూ 'నీకు అభిమానులమైనందుకు సిగ్గుపడుతున్నాం' అని రీ ట్వీట్ లు చేస్తున్నారు. ఏదిఏమైనా కమల్ అలా చేసుండకూడదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు.