శృతి హాసన్ సినిమాల్లోకొచ్చిన తొలిరోజుల్లో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకుంది. ఆమె ఏ సినిమాలో నటిస్తే... ఆ సినిమా ప్లాప్ అవుతుందని అందరూ శృతిని ఎత్తిపొడిచేవారు. అలాంటి సమయంలో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తన 'గబ్బర్ సింగ్' చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా హిట్ అవడం.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా హిట్ అవడంతో శృతి హాసన్ ప్లేట్ మారిపోయింది. అంతే ఇక తెలుగులో హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్ గా అవతారమెత్తింది. ఇక ఇప్పుడు తెలుగులో పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు'లో పవన్ సరసన, తమిళంలో తండ్రి కమల్ చిత్రం 'శభాష్ నాయుడు'లో నటిస్తూ బిజీగా వుంది. శృతి హాసన్ తన తండ్రిలాగా చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. అయితే శృతి తన తండ్రిలాగా తాను నాస్తికురాలిని కాదని చెబుతుంది. కమల్ హాసన్ అసలు దేవుడిని నమ్మడు. స్వతహాగా కమల్‌హాసన్ నాస్తికుడు. అయితే శృతి హాసన్ మాత్రం తన తండ్రిలాగ దేవుడిని నమ్మకుండా ఉండదట. తాను అందరి దేవుళ్ళని నమ్ముతానని... వీలున్నప్పుడు గుడులకు వెళ్లి పూజలు జరిపిస్తానని చెబుతుంది. అలాగే చిన్న చిన్న కోరికలు కూడా దేవుడికి చెప్పుకుంటానని అంటుంది. అయితే మరీ మూర్ఖంగా కూడా నమ్మనని అంటుంది. తనవంతు ప్రయత్నం చేశాకే మిగిలిన భారాన్ని దేవుడి మీద వేస్తానని చెబుతుంది.
ఈ విషయంలో మాత్రం తన తండ్రిని పూర్తిగా విభేదిస్తానని చెబుతుంది. ఇక కష్టపడే తత్త్వం మాత్రం తన తండ్రి దగ్గర నుండే నేర్చుకున్నాని చెబుతుంది.