ప్రజలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. ఒకే రక్తం పంచుకుపుట్టిన వారి ప్రవర్తన కూడా ఒకేలా లేనప్పుడు అందరూ ఒకే రకంగా బిహేవ్ చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక హీరో అభిమానులంతా ఒకే విధంగా ఉండాలని లేదు. ఎవరి అభిమానం, ఎవరి మనస్తత్వం ప్రకారం వారు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరు హుందాగా బిహేవ్ చేస్తే, మరికొందరు ఆకతాయి పనులు కూడా చేస్తుంటారు. కొందరి అభిమానం సినిమాల వరకే పరిమితమయితే, మరికొందరి అభిమానం హద్దులు దాటడం కూడా సహజమే. దీనిపై ఎదుటి వారు ఎలా స్పందిస్తారు?అనేది కూడా వ్యక్తుల మనస్తత్వాలను బట్టి మారుతుంది. ఇక తాజాగా వర్మ 'వంగవీటి' చిత్రం ఆడియో వేడుకలో పవన్ అభిమానుల బిహేవ్ చేసిన విధానంపై యాంకర్ ఝూన్సీ మండిపడటంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పవన్ ఫ్యాన్స్ ఇలా ప్రతి ఫంక్షన్‌లోనూ గోలగోల చేయడంపై తమ్ముడు పవన్‌ని ఎంతో ప్రేమించే అన్నయ్య నాగబాబుతో పాటు మరో సందర్భంలో అల్లుఅర్జున్ చేసిన 'చెప్పను బ్రదర్' అనే కామెంట్స్ ఎంతగా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇక 'ధృవ' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కూడా ముఖ్య అతిధిగా వచ్చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ పవన్‌కళ్యాణ్ పేరు చెప్పగానో ఫంక్షన్‌కు హాజరైన మెగాభిమానులందరూ హర్షద్వానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్పందనను చూసి ఆశ్చర్యపోయిన కేటీఆర్ సైతం ఒక్కసారిగా 'వావ్...' అంటూ పవన్‌కి ఉన్న అభిమానులను, వారి అభిమానాన్ని చూసి ఆశ్యర్యవ్యక్తం చేసి మెచ్చుకున్నాడు.
ఇక వర్మ 'వంగవీటి' చిత్రం ఆడియో ఫంక్షన్‌కు వస్తే... అక్కడ వర్మ అనే వ్యక్తిని పవన్ అభిమానులు తమ శత్రువుగా ఎప్పటి నుండో చూస్తున్నారు. మెగాభిమానులను, మెగాహీరోలను మరీ ముఖ్యంగా పవన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన అనవసరంగా పవన్ అభిమానులను రెచ్చగొడుతూ, సమయం, సందర్భం లేకుండా చేస్తున్న వెటకారపు ట్వీట్స్‌పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేలాది మంది వచ్చే ఇలాంటి ఫంక్షన్లలో కొందరు పవన్ అంటే పిచ్చి అభిమానం ఉన్నవారు వర్మకు నిరసనగా తమ అరుపులతో నిరసన తెలిపారని అంటున్నారు. పవన్ అభిమానులు తమ కోపతాపాలను ఆయన ఫంక్షన్లలోనే వ్యక్తం చేస్తే ఇబ్బంది లేదు గానీ, ఆయనకు ఎలాంటి సంబంధం లేని ఫంక్షన్లలో కూడా ఇలా గోల చేయడం మంచిపద్దతి కాదని, ఈ విషయంలో ఝూన్సీ ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పులేదని కొందరు వాదిస్తున్నారు. ఇలా తమ హీరోని, తమను వ్యతిరేకించిన అందరినీ శత్రువులుగా భావిస్తూ, అన్ని సందర్భాలలో వారిని టార్గెట్ చేయడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో వారిని దూషిస్తూ అసభ్యకరంగా కామెంట్లు చేయడం మంచి పద్దతి కాదని కొందరి వాదన. కానీ పవన్ అభిమానులు వర్మ 'వంగవీటి' ఫంక్షన్‌లో ప్రజాస్వామ్యయుతంగానే అరుపులు, కేకలతో తమ వ్యతిరేకత తెలిపారే గానీ, వేడుకకు అడ్డం కలిగించడం, దౌర్జన్యాలు, హింస, ఆస్ధుల ధ్వంసం వంటి వాటికి పాల్పడలేదని, శాంతియుతంగానే తమ నిరసనను తెలిపారు కాబట్టి ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు.