జయలలిత అస్తమయంతో తమిళ రాజకీయ ముఖచిత్రం మారింది. జయలలిత వారసత్వాన్ని పన్నీర్ సెల్వం అందిపుచ్చుకున్నాడు. మరోవైపు వృద్ధనేత కరుణానిధికి ఆరోగ్యం సహకరించడం లేదు. ఆయన వారసుడు స్టాలిన్ పై అనేక ఆరోపణలున్నాయి. పైగా తమిళనాడు రాష్ట్రాన్ని మొత్తం ప్రభావితం చేసే సత్తా ఆయనలో లేదు. తమిళుల అందరిని ఆకట్టుకోగల ఏకైక స్టార్ రజనీ కావడంతో ఇప్పుడు అందరిచూపు మరోసారి సూపర్ స్టార్ వైపు మళ్ళింది.
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి గతంలో అనేక కథనాలు వచ్చాయి. వాటిపై ఆయన స్పష్టతనీయలేదు. రాష్ట్రంలో జయలలిత, కరుణానిధి వంటి తిరుగులేని నేతలు ఉండడం వల్ల మూడో శక్తిగా ఎదగాలంటే కష్టమే అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారాయి. తమిళ రాజకీయాల్లో రాజకీయ నాయకత్వ గ్యాప్ ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. ఈ గ్యాప్ ను రజనీకాంత్ ఉపయోగించుకుంటే ఆయనకు అధికార పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం రజనీకి కలిసి వచ్చే అంశం. తమిళనాడులో పాతుకుపోవాలని ప్రయత్నిస్తున్న బిజెపికి రజనీ సపోర్ట్ లభిస్తే తిరుగే ఉండదు. వెండితెరపై అనేక పాత్రలు చేసి అభిమాన గణం అపారంగా ఉన్న రజనీ తనంటే ప్రాణమిచ్చే ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇదే సరైన సమయం.