జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019లో రాబోయే ఎన్నికల కోసం అడుగులు త్వరత్వరగా పడుతున్నాయి. అందుకోసం ఈ మధ్య పవన్ కళ్యాణ్ సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి జనసేనాని సిపిఐ నేతలతో మంతనాలు జరపడంతో మిగతా పార్టీలన్నీ ఒక్కసారిగా తత్తరపాటుకు గురౌతున్నాయి. అయితే గత ఎన్నికల్లో తెదేపా, భాజపాలకు మద్దతిచ్చిన జనసేనాని ఈసారి వాటిలో ఏ పార్టీకి మద్దతు తెలపకుండా ఏకంగా వామపక్షాలతో పొత్తుపెట్టుకొని, ఏపీలోని 175 నియోజక వర్గాల నుండి ఒంటరిగా పోటీ చేయాలని చూస్తుంది జనసేన పార్టీ. దీంతో అన్ని పార్టీలలోనూ అప్పుడే సెగలు రేపుతుంది జనసేన పార్టీ. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం మంచిదే అయినా, అలాగని అన్ని స్థానాలకు పోటీ చేయడం అంటే కాస్త ఆలోచించ దగ్గ విషయమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తక్షణం జనసేన పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకోవాలని, అందుకోసం ముందుగా జనసేనకు బాగా పట్టు ఉన్న నియోజక వర్గాలలోనే పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్రలో పవన్ కు అభిమానులు బాగా ఉన్నారు. కాగా ఈ జిల్లాల నుండి తప్పకుండా జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ముఖ్యంగా జనసేన పార్టీ ఆఫీసు మొదట అనంతపురం జిల్లా నుంచి పవన్ ప్రారంభిస్తానన్నాడు కాబట్టి అక్కడ కూడా జనసేన పార్టీ పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి, జగన్ బాగా పట్టున్న రాయలసీమ జిల్లాల నుండి కూడా జనసేన అభ్యర్థులు పోటీలోకి దిగవచ్చని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అంతే కాకుండా ఈ సారి పవన్ అడుగులు తెదేపాకు అనుకూలంగా ఉంటాయా? లేక వ్యతిరేకంగా ఉంటాయా? అన్నదే ఎవ్వరికీ అంతుపట్టని విషయంగా ఉంది. తాజాగా జనసేనాని కామ్రేడ్లతో పొత్తుపెట్టుకుంటాడన్న సంకేతాలు వస్తుండటంతో పవన్ వేసే ప్రతి అడుగు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను అమితంగా ప్రభావితం చేసేదిగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోవు సాధారణ ఎన్నికల నాటికి ఎలాంటి సంచలనాలను చవి చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.