తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింత క్షీణించిందని అపోలో ఆసుపత్రి వర్గాలు తాజాగా ప్రకటించాయి. అమ్మ ఆరోగ్యంపై మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వర్గాలు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని వెల్లడించాయి. దీంతో అటు పార్టీ కార్యకర్తల్లోనూ, జయ అభిమానుల్లో తీవ్రస్థాయిలో ఆందోళన నెలకొంది. కాగా అమ్మను నిపుణులైన వైద్య బృందం సమక్షంలో చికిత్స జరుపుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అమ్మ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అపోలో అధికారులు వివరించారు. కాగా ప్రస్తుతం ఎక్మొ యంత్రం ద్వారా జయకి చికిత్స జరుపుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా అపోలో వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ను బట్టి జయ ఆరోగ్యం ఎంతగా విషమించిందో అర్థమౌతుంది.
అయితే జయలలిత పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ చేస్తారన్న సమయానికి మళ్ళీ గుండెపోటుతో ఐసియూలో చేరడంతో తమిళనాట ప్రజలకు ఒక్కసారిగా అయోమయ పరిస్థితి ఆవరించింది. ఇంకా జయలలిత ఆరోగ్యంపై ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని అపోలో వర్గాలు ప్రకటించి, ప్రజలందరినీ ఒత్తిడికి గురిచేసేలా ఒక గంట ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటిగంటకు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. అయితే ప్రజలను మరింత ఒత్తిడికి గురిచేసేలా పోలీస్ ఫోర్స్ ను పెద్ద ఎత్తున దించడం, అపోలో చుట్టూతా హై ఎలర్ట్ ప్రకటించడం వంటివి కేంద్రం చేస్తుండటంతో ప్రజలు ఎక్కువగా ఆందోళనకు గురౌతున్నారు. మరో పక్క అపోలో వైద్యుల నుండి ఎలాంటి ప్రకటణ వినవలసి వస్తుందోనని ప్రజలు క్షణక్షణం తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నారు.