తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సెప్టంబర్ 22వ తేదీ నుండి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పూర్తిగా కోలుకుందని రేపో, మాపో డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా జయలలితకు మళ్లీ గుండెపోటు రావడంతో తిరిగి ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ మధ్య కొంతకాలంగా సాధారణ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్న జయలలితకు ఒక్కసారిగా ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం జయలలిత ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.
అయితే జయలలిత పూర్తిగా కోలుకున్నదని, ఎయిమ్స్ వైద్య నిపుణులు కూడా నిర్ధారించినట్లుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించడంతో కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి మళ్ళీ గుండపోటు రావడంతో... భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మళ్ళీ ఐసియూలో చేరడంతో జయలలిత ఆరోగ్యంపై అభిమానుల్లో తిరిగి ఆందోళన నెలకొంది.