'అన్నమయ్య, శ్రీరామదాసు' వంటి భక్తిరస చిత్రాలు అనూహ్య విజయం సాధించాయి. 'షిర్డిసాయి' మాత్రం నిరాశపరిచింది. ఇలాంటి భక్తిరస చిత్రాలను కూడా సూపర్‌హిట్ చేయడంలో రాఘవేంద్రరావు శైలి, నాగ్ నటన వంటివి ప్రధాన పాత్ర పోషించాయి. కాగా వీరిద్దరూ తాజాగా మరో భక్తిరస చిత్రమైన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో నాగ్ నట విశ్వరూపం చూపిస్తున్నాడని, అలాగే ప్రేక్షకులు భక్తిపారశ్యంలో మునిగి తేలేలా దర్శకేంద్రుడు ఈచిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్‌కు మంచి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చిత్రం కావడంతో ఈ విషయంలో నాగ్, రాఘ్‌లు మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్ వంటి వారు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. వరుసగా విభిన్న చిత్రాలను చేస్తూ వరుస హిట్స్‌లో తన కెరీర్‌లోనే పీక్ స్టేజీలో ఉన్న నాగ్ నటిస్తున్న ఈ చిత్రానికి భారీ క్రేజ్ వస్తోంది. ఈ విషయం ఈ చిత్రానికి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చూస్తే అర్ధమవుతోందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. అన్ని ఏరియాల నుండి ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్రం హక్కులను పొందేందుకు బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఇక పెద్దగా సినిమా రైట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వని ఈటీవీ సైతం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడటం విశేషం. ఈ చిత్రాన్ని ఈటీవీ దాదాపు 13కోట్లకు హక్కులను సొంతం చేసుకుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి 'శిరిడి సాయి' చిత్రంతో బాగా నష్టపోయిన నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో తాజా చిత్రానికి వస్తున్న క్రేజ్‌తో ఆ నష్టాలను భర్తీ చేసుకోవాలని వారు ఆశపడుతున్నారు.