అల్లుఅరవింద్‌ది మాస్టర్ బ్రెయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నిర్మాతగా హిట్ చిత్రాలను నిర్మించడంలో గానీ, సినిమాకు మంచి క్రేజ్ తెచ్చి మార్కెటింగ్ చేయడంలో గానీ ఆయన సిద్దహస్తుడు. ఇక తనకున్న పరిచయాలను కూడా ఆయన సెంటిమెంట్ దెబ్బతో అందరినీ బుట్టలో వేసుకోవడంలో దిట్ట. కాగా ప్రస్తుతం ఆయన గీతాఆర్ట్స్ పతాకంపై రామ్‌చరణ్ హీరోగా తమిళ 'తని ఒరువన్'కు రీమేక్‌గా 'ధృవ' చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల డిసెంబర్2న విడుదలవుతుందనుకున్న ఈచిత్రం ఓ వారం ఆలస్యంగా డిసెంబర్9న ప్రేక్షకుల ముంందుకు రానుంది. అయితే దీపావళికే రిలీజ్ చేయాలని భావించిన స్టార్‌హీరో సూర్య నటిస్తున్న 'ఎస్3' చిత్రం తన తమ్ముడు కార్తి నటించిన 'కాష్మోరా' చిత్రం కూడా దీపావళికే విడుదల కానుండటంతో తమ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా డిసెంబర్16న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. దానికి అనుగుణంగానే సినిమా షూటింగ్‌ను, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌ను కూడా వేగంగా జరుపుతున్నారు.
కానీ 'ధృవ' చిత్రం రిలీజైన వారం గ్యాప్‌లోనే 'ఎస్3' చిత్రం విడుదల కానుండటం, రెండు చిత్రాలు పోలీస్‌స్టోరీలుగానే రూపొందడంతో ఈ ఎఫెక్ట్ తెలుగులో రెండు చిత్రాల కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అందరూ భయపడ్డారు. ఇక్కడే అల్లుఅరవింద్ తన తెలివిని ఉపయోగించాడు. సూర్య నటించిన 'గజిని' చిత్రాన్ని అనువాదం చేసి, అద్భుతమైన ప్రమోషన్‌తో సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన నిర్మాత అల్లుఅరవింద్. అంతేకాదు.. ఆ తర్వాత అదే 'గజిని'చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులను కొని, అమీర్‌ఖాన్‌తో తెరకెక్కించి బాలీవుడ్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పటి నుండే ఆయనకు సూర్యతో, నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా సూర్యకు అల్లుగారంటే మంచి గౌరవం ఉంది. ఇక త్వరలో అల్లుఅరవింద్ తన తనయుడు అల్లుఅర్జున్‌ను తమిళంలోకి కూడా ఎంట్రీ ఇప్పిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఆయన తెలుగులో గీతాఆర్ట్స్ పతాకంపై, తమిళంలో జ్ఞానవేల్‌రాజాకు చెందిన స్టూడియో గ్రీన్ పతాకం భాగస్వామ్యంలో నిర్మించనున్నాడు. ఆ విధంగా ఆయనకు జ్ఞానవేల్‌రాజాతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన సూర్య నటిస్తున్న 'ఎస్3' చిత్రాన్ని ఓ వారం రోజులు ఆలస్యంగా, అంటే 'ధృవ'కు, 'ఎస్3'కి రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుంటుందని చెప్పి సూర్య, జ్ఞానవేల్‌లను ఒప్పించాడని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే 'ఎస్3'చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే రోజున విడుదల చేయనుండటంతో తమిళంలో ఈ చిత్రాన్ని వారం పోస్ట్‌పోన్ చేయడానికి అవకాశం ఉంటుందో? లేదోనని కొందరు సందేహించారు. కానీ కోలీవుడ్‌లో కూడా డిసెంబర్ 23న పెద్ద చిత్రాలేవీ పోటీ లేకపోవడం, పొంగల్ వరకు పెద్ద చిత్రాల రిలీజ్‌లు లేకపోవడంతో దీనికి సూర్య, జ్ఞానవేల్‌కు కూడా అంగీకారం తెలిపి, కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపి, తమ చిత్రాన్ని డిసెంబర్23న రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారట. మొత్తానికి మరోసారి అల్లుఅరవింద్ తన చాణక్యాన్ని ప్రదర్శించాడంటూ ఆయనను మెచ్చుకొంటూ ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.