టాలీవుడ్‌లో పలు చిత్రాలలో నటించినప్పటికీ ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయిన సొట్టబుగ్గల సుందరి తాప్సి. ఈమెకు తమిళంలో కూడా పెద్దగా అచ్చిరాలేదు. దాంతో ఈ రెండు దక్షిణాది భాషల్లో ఆమె ఐరన్‌లెగ్‌గా ముద్రపడటంతో అవకాశాలు కూడా లేక దక్షిణాదిపై అలిగి బాలీవుడ్‌కు వెళ్లిన ఈమె అక్కడ చిత్రాల ఎంపికలో ఆచితూచి ఆడుగులేస్తూ, మంచి పేరుతో పాటు అవకాశాలను సంపాదిస్తోంది. ఈ ఏడాది ఆమె 'పింక్' చిత్రం ద్వారా ప్రశంసలందుకుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. తాజాగా ఆమె నటించిన 'బేబీ' చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న 'నామ్ శభానా' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇందులో ఆమె మేకప్ లేకుండా డీగ్లామరైజ్‌డ్‌గా ముస్లిం యువతి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటన చూపించిందని, విద్యాబాలన్‌కు 'కహాని', కంగనారౌనత్‌కు 'క్వీన్' చిత్రాలు ఎంతటి పేరు తెచ్చాయో ... ఈ చిత్రంలోని పాత్ర ద్వారా తాప్సికి అంతటి పేరు ప్రఖ్యాతులు రావడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ సినీవర్గాలు. ఈ చిత్రానికి శివమ్‌నాయర్ దర్శకత్వం వహిస్తుండగా, నీరజ్‌పాండే నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో ఇప్పుడు తాప్సి టాక్ ఆఫ్ ది బిటౌన్‌గా మారింది. ఈ చిత్రంలో స్టార్‌హీరో అక్షయ్‌కుమార్ గెస్ట్‌రోల్ పోషిస్తున్నాడు. దీనితో పాటు ఆమె రానా దగ్గుబాటి సరసన త్రిభాషా చిత్రంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'ఘాజీ' చిత్రంలో కూడా కీలకపాత్రను పోషిస్తోంది. మొత్తానికి తన టాలెంట్‌ను దక్షిణాది దర్శకులు ఉపయోగించుకోలేకపోయారని, కనీసం గుర్తించను కూడా గుర్తించలేదని బహిరంగంగా చెబుతున్న ఈమె పట్టువదలని విక్రమార్కురాలిగా మారి, బాలీవుడ్‌తో దేశ, విదేశాల్లో గుర్తింపు తెచ్చుకోవడం నటిగా ఆమెకు ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనంగా చెప్పవచ్చు.