తాజాగా సుప్రీంకోర్టు ప్రతి సినిమా థియేటర్‌లోనూ, ప్రతి షోకు ముందు జాతీయ గీతమైన 'జనగణమన అధినాయక జయహే'ను ప్రదర్శించాలని, ఆ సమయంలో విధిగా ప్రేక్షకులందరూ లేచి నిలబడి, జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఆ సమయంలో థియేటర్ల స్క్రీన్‌పై ఖచ్చితంగా జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీని పట్ల చాలా మంది సామాజిక వేత్తలు, జాతీయ భావాలు కలిగిన వారు హర్షం ప్రకటిస్తున్నారు. కానీ ప్రతి విషయాన్ని నెగటివ్‌గా తీసుకొని, వెటకారం చేసే దర్శకుడు వర్మ మాత్రం దీనిపై వెటకారంతో పలు ట్వీట్స్ చేస్తున్నాడు. కేవలం జాతీయ గీతాన్ని సినిమా థియేటర్లకే పరిమితం చేయడం ఎందుకు? ఏదైనా షాప్‌లోకి కస్టమర్లు ప్రవేశించే ముందు, వీడియోలో జాతీయగీతాన్ని ప్రదర్శించి, అది చూసిన తర్వాతే షాప్ లోపలికి రావాలని ఎందుకు కండీషన్ పెట్టరు? అలాగే ప్రతిరోజు దినపత్రికలలో మొదటి పేజీలో జాతీయగీతాన్ని ప్రచురించాలని ఎందుకు ఆదేశించరు? అలా చేస్తే పాఠకులు మొదటి పేజీ నుంచి కాకుండా రెండో పేజీ నుంచి చదవడం ప్రారంభిస్తారు.. అంటూ ట్వీట్స్ చేస్తూ, సెటైర్లు వేస్తున్నాడు. ఇక కోర్టు తీర్పులపై వర్మకు ఎప్పటి నుంచో తెలియని కోపం ఉందని కొందరు అంటున్నారు.తన చిత్రం 'రణ్'చిత్రంలో ఆయన టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతం 'జనగణమన అధినాయక జయహే'ను 'జనగణమన రణ్‌హై' అంటూ రీమిక్స్ చేసుకొని వాడాడు. దీనిపై సెన్సార్‌బోర్డ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. కానీ కోర్టు కూడా వర్మకు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత వర్మ మాట్లాడుతూ, తాను ఎవ్వరినీ విమర్శించడానికి గానీ, అవమానించడానికి గానీ అలా చేయలేదని, కేవలం తన చిత్రం ప్రచారం కోసమే అలా వాడానని వివరణ ఇచ్చాడు. తద్వారా తాను జాతీయ గీతాన్ని కూడా పబ్లిసిటీలో భాగంగా వాడుకున్నానని ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆయన కోర్టులపై కూడా అసహనం పెంచుకొని, ప్రస్తుతం సుప్రీం ఇచ్చిన తీర్పును వెటకారం చేస్తున్నాడని అంటున్నారు. కానీ డైరెక్ట్‌గా ఈ నిర్ణయాన్ని విమర్శిస్తే అత్యున్నత న్యాయస్దానం ఇచ్చిన తీర్పు విషయంలో తన కామెంట్స్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని భావించిన వర్మ 'షాపుల్లో ఎందుకు ప్రదర్శించకూడదు..' అంటూ ఏదో డౌట్‌ను అడుగుతున్నట్లుగా సెటైర్లు వేస్తున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు.