భారత ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని రాజకీయ నాయకులంతా గజగజా వణికిపోతున్నారు. అందుకనే అదే పనిగా పెట్టుకొని మరీ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక్కటై మోడీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏకంగా సామాన్య ప్రజలు న్యూ కరెన్సీ కోసం నానా పాట్లు పడుతున్నారంటూ.. ఇంకా మోడీని నానా మాటలు అంటూ... ఒక పిచ్చి తుగ్లక్ గా మోడీ తీసుకున్న నిర్ణయంపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అలా భాజపా తప్ప ఇతర పార్టీలన్నీ కూడా మోడీ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబడుతున్నాయి. అయితే మోడీ తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న విషయం పక్కన బెడితే కొత్తనోటు కోసం సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనిస్తే గుండె తరుక్కుపోతుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించాడు. పెద్ద నోట్ల రద్దు అనేది సరిగా, ప్రణాళికాబద్ధంగా అమలు కావడం లేదని వెల్లడిస్తున్నాడు. అలాగే జగన్ కూడా స్పందించాడు. అది ఎలాగంటే.. బాబుకు ముందే తెలియడంతో అంతా సర్దేసుకున్నాడంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి అనుగుణంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి గానీ ఏ మాత్రం పట్టనట్లుగా బాబుపైనే గురి చూస్తూ తన బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లుగా తెలుస్తుంది. జగన్ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు సందర్భానుసారంగా లేవంటూ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం మోడీకి సంబంధించింది కాబట్టి, అలాంటివేమన్నా చేస్తే మోడీపైనే విమర్శలు చేయాలి గానీ ఇలా బాబు వంటి నాయకులను అలా అనడం పద్ధతి కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించాడు. దీనంతటికి మోడీనే బాధ్యత వహించాలంటూ నర్మగర్భంగా మోడీపైనే బాణం వదిలాడు పవన్. కాగా పవన్ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు అనేది ఏమాత్రం కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంగా ఆయన అభిప్రాయాన్ని తెలిపాడు. కాగా ఇక్కడ ఈ నోట్ల రద్దు విషయంలో జగన్ కంటే పవన్ చాలా తెలివిగా మెలకువతో అవసరార్థం ఎలా స్పందించాలో అలా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడని, జగన్ ఏమాత్రం ప్రజల పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే అయితే రాబోవు రోజుల్లో జగన్ స్థానాన్ని పవన్ కైవసం చేసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.