కేసీఆర్ ది వన్ మేన్ షో. ఆయనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత. ఇన్ని తెలివితేటలున్నప్పటికీ సలహాదారులను నియమించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కీలక రంగాలైన నీటిపారుదల, విద్యుత్, ప్రాజెక్ట్ లకు సంబంధించి అందులో నిష్ణాతులైన వారిని సలహాదారులుగా పెట్టుకుంటే కొంత నయం. కానీ రాజకీయ ఉద్దేశాలతో సలహాదారులను నియమించడం మాత్రం తొందరపాటు చర్యే. తాజాగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, వి సిక్స్ టీవీ అధినేత వివేక్ ను సలహాదారుగా నియమించేశారు. క్యాబినేట్ ర్యాంక్ తో మూడేళ్ళ పదవి అన్నారు. ఈయనగారి మీద నెలకు సుమారు పది లక్షల ఖర్చు తప్పదు. ఇటీవలే పొదుపు, జాగ్రత్తల గురించి మాట్లాడిని కేసీఆర్ సారూ అది ప్రజలకే వర్తిస్తుంది కానీ తనకు కాదన్నట్టు భావిస్తున్నారు.
వివేక్ గత ఎన్నికల్లో పెద్దపల్లి నుండి ఓడిపోయారు. ఆయన బడా పారిశ్రామికవేత్త. ప్రజల్లో పలుకుబడి అంతంత మాత్రమే. అలాంటి నేతను సలహాదారుగా దరిచేర్చుకోవడం చాలామందికి రుచించడం లేదు. రాజకీయ పునరావాసంలా కనిపిస్తోంది. ఇక సలహాదార్లు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలియదు. గతంలో అంతరాష్ట్ర సలహాదారుగా డి.శ్రీనివాస్ ను నియమించారు . ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నియమిస్తున్న సలహాదార్ల జాబితా పెరుగుతూనే ఉంది.