మెగాబ్రదర్‌గా పేరొందిన నటుడు, నిర్మాత నాగబాబు ముక్కుసూటిగా, దాపరికం లేకుండా మాట్లాడుతాడనే పేరుంది. కాగా తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నానని మరోసారి స్పష్టం చేశాడు. మోదీ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే నియంతలు ప్రస్తుతం దేశానికి అవసరం అన్నాడు. సాధారణ కాంగ్రెస్ కార్యకర్తను అయినప్పటికీ తాను మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని స్పష్టం చేశాడు. తన అన్నయ్య కాంగ్రెస్ కీలకనాయకుడైనప్పటికీ, తన తమ్ముడు జనసేన అధినేత అయినప్పటికీ తన వ్యక్తగత అబిప్రాయం ఇదేనన్నాడు. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా దీర్ఘకాలంలో దీనివల్ల ప్రజలకు, దేశానికి మంచే జరుగుతుందన్నాడు.
ఇక తన తమ్ముడు పవన్‌కళ్యాణ్ కూడా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, కేవలం సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మాత్రమే చూడాలని చెప్పాడన్నారు. ఇక పవన్ నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న బాధలను తెలియజేస్తూ, ఆయన స్నేహితుడు సాయిమాధవ్ రాసిన కవితను ట్వీట్ చేయడాన్ని మాత్రం నాగబాబు ఖండించాడు. పరిస్థితి మరీ అంత దారుణంగా లేదన్నాడు. ఈ సందర్భంగా ఆయన అవినీతిపరులైన రాజకీయనాయకులపై విమర్శలు చేశాడు. అలాగే ప్రస్తుతం ప్రజలు తీరు కూడా బాగాలేదని, ఓటేయడానికి డబ్బులు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని అంటూ నీతిమంతులైన నాయకులు నేడు అవసరమని, అందుకే తన అన్నయ్య చిరు రాజకీయాల్లోకి వచ్చారని చిరును వెనకేసుకొచ్చాడు. ప్రజారాజ్యం పార్టీని ఎన్నికలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రారంభించడంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లలేకపోయామని, అదే ఎన్నికలకు ముందు కనీసం నాలుగైదు సంవత్సరాల ముందు పార్టీని ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. ఇక తన తమ్ముడు పవన్ కేవలం అభిమానుల కోసం జనసేన పెట్టలేదని, తమ ముగ్గురిలో పవన్ కాస్త తేడా అని, ఉన్నతభావాలు ఉన్న ఆయన అనుకున్నది చేస్తాడని, ఎవరు చెప్పినా వినరని తేల్చిచెప్పాడు. ఇక పవన్ రాజకీయాలతో పాటు సినిమాలలో కూడా నటించాలనే నిర్ణయం గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు వాడు ఏమీ దాచిపెట్టలేదు. ఆర్ధికంగా తన జీవనం సాగించాలంటే సినిమాల్లో నటించకతప్పదని చెప్పుకొచ్చాడు. ఇక 'ఆరెంజ్' చిత్రం గురించి మాట్లాడుతూ, తాను ఆ చిత్రం వల్ల బాగా నష్టపోయిన మాట వాస్తవమేనని, ఇప్పటివరకు ఆ చిత్రంలో నటించినందుకు చరణ్‌కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేకపోయానని, భవిష్యత్తులో ఎలాగైనా ఇచ్చేస్తానని తన అంతరంగాన్ని చెప్పుకొచ్చారు. కాగా ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన మాట్లాడినదంతా వాస్తవమే అంటుండగా, మరికొందరు మాత్రం ఆయన తన అన్న, తమ్ముడు విషయంలో వాస్తవాలను వక్రీకరించాడంటున్నారు. మరి దీనిపై మెగాభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.