తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటుగా పది వేల చిల్లర నగదు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈనెలలో జీతాల కోసం 1,135 కోట్లు, ఫించను కోసం 600 కోట్లు సిద్ధం చేశారు. మొత్తం 1,735 కోట్లు చెల్లించాలంటే పెద్ద నోట్ల రద్దుతో రాబడి తగ్గిన నేపథ్యంలో కష్టమే. కానీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే అప్రతిష్ట. దీన్ని అధిగమించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇతర కోతలు విధించింది. అంటే వివిధ పథకాలకు చెల్లింపులు నిలిపివేసిందన్నమాట. ఇలా చేయడం వల్ల అనేక మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల క్షేమమే ముఖ్యం కాబట్టి నిధులు దారిమళ్లించి ఈనెల జీతాలు చెల్లించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో ఉండదని, పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇక జీతంతో పాటు నగదు ఇవ్వడానికి రిజర్వు బ్యాంక్ అనుమతి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.