రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పలు రాయితీలు ప్రకటించనున్నట్టు సమాచారం. అలాగే ప్రతి ఏడాది సినిమాలకు ఇచ్చే అవార్డులను కొత్త పేరుతో ఇవ్వాలని భావించి పేరును సూచించడానికి కమిటీని సైతం ఏర్పాటుచేసింది. గతంలో 'నంది' పేరుతో పురస్కారాలు అందించేవారు. ఇప్పుడు 'నంది' అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి తెలంగాణ సినిమా అవార్డులకు మరో పేరు పెట్టాలని భావించారు. కమిటీ అనేక పేర్లు పరిశీలించి తాజాగా 'సింహా' అనే పేరుతో ఇవ్వనున్నట్టు తెలిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రికి నరసింహస్వామి అంటే అపారమైన భక్తి. అందుకే యాదగిరి గుట్టను యాదాద్రి జిల్లాగా మార్చారు. గుడి అభివృద్ది కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీ 'సింహా' పేరుతో అవార్డులు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. దీనిని కేసీఆర్ ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు.