ఈ మధ్యన నిఖిల్ సినిమాలన్నీ వరసబెట్టి హిట్ అయిపోతున్నాయి. మధ్యలో 'శంకరాభరణం' వంటి ప్లాప్ వచ్చినా కూడా నిఖిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్ గా దూసుకుపోతున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్ తో నిఖిల్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం పెద్దనోట్ల రద్దు దెబ్బకి ఏమాత్రం భయపడకుండా థియేటర్స్ లో దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా హిట్ తో నిఖిల్ కి ఆఫర్స్ వెల్లువలా వచ్చిపుడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ చిత్రాల నిర్మాత దిల్ రాజు, నిఖిల్ తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడని సమాచారం.
దిల్ రాజు పిలిచి తన బ్యానర్లో సినిమా చేద్దామంటే ఇక నిఖిల్ పంటపండినట్లే. దిల్ రాజు ఆఫర్ ఒకవైపు వస్తే మరోవైపు హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ వారు నిఖిల్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక నితిన్ అయితే నిఖిల్ తో ఇప్పటికే మాట్లాడినట్లు, కథ, డైరెక్టర్ అన్ని విషయాలు నిఖిల్ ఇష్టమే అని నితిన్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు నిఖిల్ ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి మూడు రేట్లు ఎక్కువ ఆఫర్ చేసినట్లు ప్రచారం మొదలైంది. మరి నిజంగానే నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ గనక నిఖిల్ తో సినిమా చేస్తే నిఖిల్ ని ఇక పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు.
మరోపక్క అభిషేక్ పిక్చర్స్ వారు కూడా నిఖిల్ తో సినిమా చెయ్యడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ మాత్రం ఏదిబడితే అది ఒప్పుకుని దెబ్బతినడం ఇష్టం లేక ఆచితూచి అడుగులు వేస్తున్నాడని... కథ నచ్చితేనే సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు నిఖిల్ సన్నిహితులు చెబుతున్నారు.